Bigg Boss 6 Telugu: నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు - బిగ్ బాస్ షో ఆగిపోతుందా?
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది. ఇప్పటికే యాభై ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది ఈ షో.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). ఈ షోని ఇష్టపడేవారితో పాటు విమర్శించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ షోలో బూతులు, బోల్డ్ నెస్ ఎక్కువయ్యాయంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి షోలను చూడలేమంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ చాలా సార్లు ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చారాయన. సమాజాన్ని చెడగొట్టేలా ఈ షో ఉందంటూ ఆయన పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు మరోసారి ఈ షోపై వివాదం చెలరేగింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది. ఇప్పటికే యాభై ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది ఈ షో. ఇలాంటి సమయంలో షోని నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ షో వివాదం ఏపీ హైకోర్టుకి చేరింది. సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బిగ్ బాస్ షోని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు గతంలోనే ఆ షోలోని రెండు, మూడు ఎపిసోడ్స్ ను చూస్తామని చెప్పింది.
ఈరోజు విచారణలో భాగంగా బిగ్ బాస్ షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునకు కూడా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.
రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గతంలో విచారణ జరిపి.. బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని తెలిపింది. ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్న కారణంగా.. ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరిపి.. షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?
సీపీఐ నారాయణ వ్యాఖ్యలు:
బిగ్ బాస్ హౌస్ ముమ్మాటికీ బ్రోతల్ హౌస్ అంటూ మొన్నామధ్య విరుచుకుపడ్డారు నారాయణ. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు సంసారులు కాదన్నారు. అందులో ఏదో ఒకటి చేసుకునే బయటకు వస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్లు పతివ్రతలు కారని నారాయణ అన్నారు. ఎవరైనా వాళ్లు పతివ్రతలే అని చెప్పినా తను నమ్మనన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు హౌస్ లోపలికి వెళ్లి ఏం చేసుకుంటున్నారో ఓపెన్ గా చూపించే దమ్ముందా? అని నారాయణ ప్రశ్నించారు. అంతేకాదు.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జుననూ నారాయణ టార్గెట్ చేశారు. వాళ్ల ఇంట్లో వారిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ పై నారాయణ నిత్యం ఇలాంటి కామెంట్లు చేయడం, మీడియాలో ఆ వార్తలు ప్రసారం కావడం జరిగినా.. బిగ్ బాస్ నిర్వహకులు, నాగార్జున ఏనాడు స్పందించలేదు. కానీ, మరింత తీవ్ర స్థాయిలో ఎటాక్ చేయడంతో నాగార్జున మొన్నామధ్య షోలో ఇన్ డైరెక్ట్ గా నారాయణపై పంచ్ వేశారు.