Unstoppable With NBK 2 : పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే...
Unstoppable With NBK 2 : నట సింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క ఫ్రేమ్‌లోకి వస్తే? కనిపిస్తే? కలిసి సందడి చేస్తే? ఆ ఊహ ఎంత బావుందో కదూ! ఊహను నిజం చేయడం కోసం 'ఆహా' ప్రయత్నిస్తోంది.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK - Season 2) స్టార్ట్ చేయడానికి నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రెడీ అవుతున్నారు. మొదటి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తారని 'ఆహా' వర్గాల గుసగుస. అది పక్కన పెడితే... ఈ రెండో సీజన్‌లో సందడి చేయనున్న అతిథుల గురించి మరో ఆసక్తికరమైన విషయం వినబడుతోంది. అది ఏంటంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ సందడి చేయనున్నారట.
దసరాకు స్టార్ట్ చేయాలనేది ప్లాన్!
విజయ దశమి సందర్భంగా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' (Unstoppable Season 2) స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' సినిమా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అందువల్ల, ఆయనను అతిథిగా తీసుకు రావాలనేది ఒక ప్లాన్. 'ఆహా'లో గీతా ఆర్ట్స్ అథినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భాగస్వామి. ఆయన చిరంజీవికి బావమరిది. పైగా, మంచి స్నేహితులు. అందువల్ల, చిరంజీవిని తీసుకు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే... చిరు కాకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వస్తే ఎలా ఉంటుంది? అనే డిస్కషన్ కూడా జరుగుతుందట!
త్రివిక్రమ్ ద్వారా పవన్‌కు ప్రతిపాదన!
సాధారణంగా సినిమా విడుదల సమయంలో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీడియా ముందుకు ఎక్కువ సమయం వస్తున్నారు గానీ... అంతకు ముందు ఆయన కనిపించింది తక్కువ. 'అన్‌స్టాపబుల్' షోలో రాజకీయాలతో పాటు సినిమా ముచ్చట్లు కూడా ఉంటాయి. అందువల్ల, త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదన పంపించారట. ఈ షోకి రావడానికి ఇద్దరూ సూత్రప్రాయంగా అంగీకరించారట.
Balakrishna To Interview Pawan Kalyan : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులూ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎన్టీఆర్ సినిమా ముచ్చట్లు వస్తాయా?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌కు పాత సినిమాలు, పాటలు అంటే ఇష్టం. ఇద్దరూ కలిసి పాత సినిమాలు చూసినట్లు గతంలో కొన్ని సందర్భాలలో చెప్పారు. 'అన్‌స్టాపబుల్' షోకి వస్తే... కచ్చితంగా పాత సినిమాలు, అందులోనూ ఎన్టీఆర్ సినిమా ముచ్చట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే... ముందు పవన్, త్రివిక్రమ్ షూటింగ్ చేయడానికి రావాలి. వస్తే ఈ నెల 26 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇప్పటి వరకు బాలకృష్ణతో త్రివిక్రమ్ సినిమా చేయలేదు. బాలయ్యతో రీమేక్ చేయాలని మలయాళ సినిమా 'అయ్యపనుమ్ కోశియుమ్' రైట్స్ తీసుకుంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ చేశారు. ఆ ముచ్చట్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్
ప్రస్తుతం బాలకృష్ణ 'NBK107' సినిమా షూటింగ్ కోసం టర్కీలో ఉన్నారు. కుదిరితే అక్కడ... లేదంటే ఇండియాకి వచ్చేటప్పుడు దుబాయ్‌లో 'అన్‌స్టాపబుల్' ఓపెనింగ్ షాట్ షూట్ చేయాలని అనుకుంటున్నారట.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' మొదటి సీజన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, రష్మికా మందన్నా తదితరులు సందడి చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ రెండో సీజన్‌లో కూడా సందడి చేయనున్నారని టాక్.
Also Read : భర్తకు నయనతార సర్‌ప్రైజ్... అక్కడికి తీసుకువెళ్ళి మరీ