తునీషా మరణానికి ముందు జరిగింది ఇదే - షాకింగ్ విషయాలు వెల్లడించిన షీజాన్ సోదరి
బాలీవుడ్ బుల్లితెర నటి తునిషా శర్మ ఆత్మహత్యపై వివాదం మరింత ముదురుతోంది. తునీషా తల్లి షీజాన్ ఫ్యామిలీ పై చేసిన ఆరోపణలకు షీజాన్ కుటుంబం సోమవారం విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చింది.
బాలీవుడ్ బుల్లితెర నటి తునీషా శర్మ ఇటీవల ముంబైలోని షూటింగ్ సెట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతి బాలీవుడ్ లో సంచలనం రేపింది. ముంబై పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో తునీషా మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. షీజాన్ ఫ్యామిలీపై తునీషా తల్లి పలు ఆరోపణలు చేయడంతో షీజాన్ కుటుంబ సభ్యులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో షీజాన్ తరఫు న్యాయవాది శైలేంద్ర మిశ్రా, తల్లి కహాక్షన్ ఖాన్, చెల్లెల్లు ఫలాక్ నాజ్, షఫాక్ నాజ్ పాల్గొన్నారు. షీజాన్, తునీషాల గతం గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా షీజాన్ తరఫు న్యాయవాది మిశ్రా మాట్లాడుతూ.. తునీషా శర్మ కు చండీగఢ్ కు చెందిన సంజీవ్ కౌశల్, తునీషా తల్లి వనితా ఈ ఆమె ఆర్థిక వ్యవహారాలు నియంత్రించేవారని చెప్పారు. తునీషా తన సొంత డబ్బు ఖర్చు చేయడానికి కూడా ఆమె తల్లిని అడిగేదని వెల్లడించారు. అతని ప్రోద్బలంతోనే తునీషా తల్లి ఆమెను హింసించేదన్నారు. లాక్ డౌన్ తర్వాత తునీషాను చండీగఢ్ వెళ్లాలని ఆమె తల్లి బలవంతం చేసిందని, అందుకు ఆమె నిరాకరించడంతో ఫోన్ పగలకొట్టి, కత్తితో గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించిందని పేర్కొన్నారు. తునీషా.. సంజీవ్ పేరు వింటేనే భయపడిపోయేదని చెప్పారు. ఆమె మరణానికి గతం నుంచీ అనుభవిస్తున్న మానసిక ఆందోళనే కారణమని మిశ్రా వెల్లడించారు.
మరోవైపు షీజాన్ కు సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఉందని తునీషా తల్లి వనిత చేసిన ఆరోపణలపై షీజాన్ చెల్లెల్లు స్పందించారు. తునీషా శర్మ తమకు అక్క లాంటిదని అన్నారు. తమకు రక్తసంబంధం లేకపోయినా, తమ మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని అన్నారు. తునీషా.. హిజాబ్ ధరించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది, అయితే అది లవ్ జీహాద్ కాదని, తునీషా, షీజాన్ నిజంగా ప్రేమించుకున్నారని చెప్పారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని అన్నారు. హిజాబ్ ధరించడం, ఉర్దూ మాట్లాడడం షూటింగ్ లో భాగమేనని పేర్కొన్నారు. తమపై మత మార్పిడి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే షీజన్ కు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరని చెప్పారు. తునీషాను ఆమె తల్లి కూడా నిర్లక్ష్యం చేసిందని, దాన్ని ఆమె కూడా అంగీకరించిందని గుర్తు చేశారు. తునీషా మరణానికి ఆమె చిన్నపటి నుంచీ పడుతోన్న డిప్రెషనే అని చెప్పారు. ఇక తునీషా డిసెంబర్ 24 న తన టీవీ షో ‘అలీ బాబా: దస్తాన్-ఈ-కాబుల్’ సెట్స్ లో శవమై కనిపించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మాజీ ప్రియుడు షీజాన్ కు కోర్టు శనివారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది