The Exorcism Of Emily Rose: ‘ది ఎక్సొర్సిజం అఫ్ ఎమిలీ రోజ్’ రియల్ స్టోరీ.. ఆరు ప్రేతాత్మలు ఆమెకు నరకం చూపాయ్!
‘‘ఒక్క ఆత్మ ఆవరిస్తేనే నరకం కనిపిస్తుంది. అలాంటిది ఆమెను ఆరు ప్రేతాత్మలు ఆవరించాయి. ఎముకులను నుజ్జు చేసి.. శరీరాన్ని పిండి చేశాయ్’’ అని ఆమెకు Exorcism చేసిన మత పెద్దలు చెప్పిన మాటల్లో నిజమెంత?
‘ది ఎక్సొర్సిజం అఫ్ ఎమిలీ రోజ్’ (The Exorcism of Emily Rose).. ఈ సినిమా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. వాస్తవానికి ఈ సినిమాలో ఎమిలీ పాత్ర పోషించిన యువతిని చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ, రియల్ స్టోరీలో ఆమెకు గురించి తెలిస్తే జాలేస్తుంది. ఆమె అనుభవించిన నరకయాతన మీ గుండెను బరువెక్కి్స్తుంది. 2005లో విడుదలైన ఈ సినిమాకు కాస్ట్ డెర్రిక్ సన్ దర్శకత్వం వహించారు. 1970 నుంచి 1976 మధ్య కాలంలో జర్మనీలో చోటుచేసుకున్న వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 19 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద 144.2 మిలియన్ డాలర్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఆ చిత్రాన్ని చూసే ముందు.. అసలు ఎమిటీ రోజ్ ఎవరు? ఆమెకు ఏమైంది? ఆమెకు నిజంగా దెయ్యం పట్టుకుందా? అనారోగ్యమా? ఆమె ఒక్కసారే ఆరు గొంతులతో ఎలా మాట్లాడగలిగేది? ఆమె మరణం తర్వాత భూత వైద్యంపై ఎందుకు కఠిన ఆంక్షలు విధించారనేది తప్పకుండా తెలుసుకోవల్సిందే. ఇక సినిమా కథ నుంచి రియల్ స్టోరీలోకి వెళ్లిపోదామా..
చెవిలో ఎవరో మాట్లాడుతున్నారు..: వాస్తవానికి ఎమిలీ రోజ్ అనేది కేవలం సినిమాలోని పాత్ర పేరు మాత్రమే. బాధితురాలి అసలు పేరు అన్నెలీస్ మిచెల్. ఈమె పశ్చిమ జర్మనీలోని బవారియాలో జన్మించింది. కేథలిక్ కుటుంబానికి చెందిన మిచెల్‌కు దైవ భక్తి ఎక్కువ. ఎప్పుడూ దైవారాధనలో మునిగి తేలేది. 1970లో మిచెల్‌కు 16 ఏళ్ల వయస్సు రాగానే అసలు సమస్య ఎదురైంది. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఉండే ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. అంతుచిక్కని వ్యాధి వల్ల మానసికంగా కుంగిపోయింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తన చెవిలో ఏవరో మాట్లాడుతున్నట్లు ఉందని, తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పడం ప్రారంభించింది. దీంతో ఆమె మనోవైకల్యంతో బాధపడుతోందని భావించారు. ఎన్నిరకాల చికిత్సలు అందించినా ఆమెలో మార్పు కనిపించలేదు. అయితే.. అనారోగ్యం బాధిస్తున్నా..1973లో మిచెల్ వుర్జ్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేయడం గమనార్హం.
నువ్వు నరకంలో కుళ్లిపోతున్నావ్..: అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఆమె దైవ ప్రార్థనలు చేసేది. కానీ, పరిస్థితి మునుపటిలా లేదు. దేవుడిని తలచుకుంటూ కళ్లుమూసుకొనే సమయంలో ఆమెకు ఎవరిదో గొంతు వినిపించేది. ‘‘నువ్వు నరకంలో కుళ్లి పోతున్నావ్’’ అనే మాటలు తనకు వినిపిస్తున్నాయని చెప్పేది. కానీ, ఆమెకు మతిస్థిమితం లేదని ఎవరూ నమ్మేవారు కాదు. ఆ భయం చివరికి.. దేవుడంటే భయపడేలా చేసింది. చర్చిలోకి వెళ్లాలంటే భయపడేది. చివరికి శిలువను చూసినా సరే ఆమె ఆందోళనకు గురయ్యేది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందనే అనుమానంతో స్నేహితులు హోలీ వాటర్ (పవిత్ర తీర్థం) తాగించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె అందుకు ఇష్టపడలేదు. పైగా.. చర్చికి వెళ్తే ఆమె మూర్చపోయేది. ఏమైందని అడిగితే.. నేల కాలిపోతుందని, కాళ్లు మండుతున్నాయని స్నేహితులకు చెప్పేది. ఎవరి ముఖాలు చూసినా భయంకరంగా కనిపించేవని, తనని చూస్తూ పళ్లు కొరుకుతున్నట్లు కనిపిస్తున్నారని మిచెల్ తెలిపేది. దీంతో మిచెల్ కుటుంబ సభ్యులు.. ఆమెకు దెయ్యం పట్టిందని భావించారు. వైద్యుల వల్ల కానిది.. భూతవైద్యులతో సాధ్యమవుతుందని భావించారు. వెంటనే వారిని ఆశ్రయించి సాయం కోరారు.
మత పెద్దల మనసు కదిలించిన మిచెల్ లేఖ: మిచెల్ పరిస్థితి గురించి తెలుసుకున్న చర్చి పెద్దలు.. భూత వైద్యం(Exorcism)కు అనుమతి ఇచ్చారు. కానీ బిషప్ జొసేఫ్ స్తంగాల్ నుంచి అనుమతి రాలేదు. చర్చి ఫాదర్ ఎర్నస్ట్ ఆల్ట్ ఎన్నోసార్లు బిషప్‌ను కలిసి ఆమె సమస్యను వివరించాడు. కానీ, అనుమతి లభించలేదు. దీంతో మిచెల్ తన దయనీయ పరిస్థితి గురించి అన్ని వివరాలను రాసి బిషప్‌కు పంపించింది. ఆ లేఖ మాత్రమే బిషప్ మనసు కరిగేలా చేసింది. మొత్తానికి ఆయన భూతవైద్యానికి అనుమతి ఇచ్చారు. ప్రీస్ట్ ఆర్నాల్డ్ రెంజ్‌కు Exorcism బాధ్యతను అప్పగించారు. బయట ప్రపంచానికి తెలియకుండా.. ఆమె సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ప్రతిదీ రికార్డు చేయాలని తెలిపారు. దీంతో 1975, సెప్టెంబరు 24 నుంచి మిచెల్‌కు భూత వైద్యం మొదలైంది. దీంతో తల్లిదండ్రులు ఇక వైద్యులను సంప్రదించడం మానేశారు.
ఒకేసారి ఆరు గొంతులతో..: Exorcism చేస్తున్న సమయంలో ఆమె శరీరం వంకర్లు తిరిగిపోయేది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు రకాల గొంతులు వినిపించేవి. ఆ ఆడియో ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆమె సమస్యను తెలుసుకోవడం కోసం ప్రీస్ట్ ఆర్నాల్డ్ ఆ ఆరు గొంతులు ఎవరివో తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ మాటలు.. నేరో, లుసీఫర్, జుదాస్ ఇస్క్రీయాట్, కైన్, బెలీయల్, లెజియాన్ అనే ప్రేతాత్మలవని తెలుసుకుని షాకయ్యారు. ఎందుకంటే.. ఒక్క ప్రేతాత్మ ఆవరిస్తేనే శరీరం హూనమైపోతుంది. అలాంటిది ఆమెను ఏకంగా ఆరు ప్రేతాత్మలు పట్టుకున్నాయి. వాటిని ఆమె శరీరం నుంచి బయటకు తీయడమంటే ప్రాణాలతో చెలగాటమే అని ఆర్నాల్డ్ తెలుసుకున్నారు. చివరికి చేతులెత్తేశారు. ఫలితంగా మిచెల్ 1976, జులై 1వ తేదీన చనిపోయింది. అయితే, కథ అక్కడితో ఆగిపోలేదు.
ఆమె మరణానికి కారణం Exorcism?: పోలీసులు ఈ కేసును వేరే కోణంలో తీసుకున్నారు. మిచెల్‌కు అనారోగ్యానికి చికిత్స అందించకుండా.. Exorcism పేరుతో చంపేశారంటూ కేసు నమోదు చేశారు. ఇందుకు చర్చి పెద్దలు, బిషప్, ప్రిస్ట్‌తోపాటు మిచెల్ తల్లిదండ్రులు కూడా బాధ్యులేనని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో మిచెల్ పౌష్టికాహర లోపంతో చనిపోయినట్లు తేలింది. సరైన ఆహారం అందకపోవడం వల్ల ఆమె ఎముకులు పెలుసుగా మారిపోయి చిధ్రమయ్యాయని, అందుకే ఆమె నడవలేని స్థితికి చేరిందని పేర్కొన్నారు. దారుణమైన యాక్సిడెంట్ జరిగినట్లు ఆమె శరీర అంతర్గత భాగాలు నుజ్జయ్యాయని వివరించారు. అయితే, కూతురి చావును తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా కోరుకోరనే కారణం, అప్పటికే వారు కూతురు లేదనే ఆవేదనతో ఉండటంతో పోలీసలు వారికి కేసు నుంచి ఉపశమనం కల్పించారు. ఈ కేసులో కోర్టు బిషప్, చర్చి పెద్ద, ప్రీస్ట్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించి.. రద్దు చేశారు. వారు ముందు జాగ్రత్తగా రికార్డు చేసిన ఆడియో, వీడియోలే రికార్డులే వారిని జైలుకు వెళ్లకుండా కాపాడాయి. ఆ వీడియోల్లో మిచెల్ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం, ఆరు గొంతులతో మాట్లాడటం, ఆహారాన్ని విసిరేయడం వంటి భయానక దృశ్యాలు చూసిన తర్వాత న్యాయమూర్తులు నోట మాట రాలేదు.
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
రెండుసార్లు ఖననం: ఈ కేసు కోర్టులో సుమారు రెండేళ్లు నడిచింది. అయితే మిచెల్ తల్లిదండ్రులు మరోసారి ఆమెకు సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు జరుపుతామని కోర్టును కోరారు. మిచెల్‌కు దెయ్యం పట్టిందనే కారణంతో అంత్యక్రియలు సక్రమంగా జరపాలేదని, నాణ్యతలేని శవ పేటిలో పెట్టి పూడ్చిపెట్టామని తెలిపారు. దీంతో కోర్టు వారికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మిచెల్ భౌతిక కాయాన్ని మరో శవపేటికలో పెట్టి మరోసారి అంత్యక్రియలు జరిపారు. మిచెల్ ఘటన తర్వాత Exorcism నిబంధనలను కఠినతరం చేశారు. చర్చి ఫాదర్, మత పెద్దలు ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘Conjuring’ మూవీ సీరిస్‌ల్లో Exorcism వల్ల ఎదురయ్యే సమస్యలు, భూతవైద్యం చేసేవారి కష్టాలను చూడవచ్చు. ఈ చిత్రాలను కూడా కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగానే తెరకెక్కించారు.
Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి