(Source: ECI | ABP NEWS)
Shilpa Shetty: కుట్రపూరితంగానే రూ.60 కోట్ల మోసం కేసు - ఖండించిన శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు
60 Crore Fraud Case: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై రూ. 60 కోట్ల ఫ్రాడ్ కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. అయితే ఇది తప్పుడు కేసు అని ఆ దంపతులు ప్రకటించారు.

Shilpa Shetty And Raj Kundra Deny Rs 60 Crore Fraud Claims: బాలీవుడ్ జంట శిల్పాషెట్టి, రాజ్ కుంద్రాపై మోసం కేసు నమోదు అయింది. రూ.60.4 కోట్ల మోసం కేసుకు సంబంధించి శిల్పా శెట్టి కుంద్రా , ఆమె భర్త రాజ్ కుంద్రాపై దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రూ.60.4 కోట్ల మోసం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా , ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసిన వెంటనే వారి లాయర్ వివరణ ఇచ్చారు. ఈ కేసును "నిరాధారమైనది" అని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు . ఇది తన క్లయింట్ల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఫిర్యాదు చేశారని వాదించారు.
బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు చేశారు. 2015 - 2023 మధ్య జరిగిన రుణం-కమ్-పెట్టుబడి ఒప్పందంలో ఈ జంట తనను రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉనికిలో లేదు.
"నా క్లయింట్‌లపై ముంబైలోని ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైందని ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలలో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని నా క్లయింట్లు ఖండించారు. ఇవి పూర్తిగా సివిల్ స్వభావం కలిగి ఉన్నాయి. ఇప్పటికే 04/10/2024న NCLT ముంబై ద్వారా తీర్పు కూడా వచ్చింది. " అని శిల్పాషెట్టి దంపుతల న్యాయవాది ప్రశాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కంపెనీ ఆర్థిక ఇబ్బందుల తర్వాత చట్టపరమైన విషయంగా మారిందని.. అది పాత వ్యాపార లావాదేవీగా పేర్కొన్నారు. "ఇందులో ఎటువంటి నేరం లేదు. మా ఆడిటర్లు EOW కోరినట్లుగా, వివరణాత్మక బ్యాంక్ స్టేట్‌మెంట్లతో , అవసరమైన అన్ని సహాయక పత్రాలను ఎప్పటికప్పుడు సమర్పించారు." అని లాయర్ స్పష్టం చేశారు. పెట్టుబడి ఒప్పందం ఈక్విటీ పెట్టుబడి లాంటిదని, కంపెనీకి ఇప్పటికే లిక్విడేషన్ ఆర్డర్ అందిందని, దానిని పోలీసు శాఖకు కూడా సమర్పించామని ఆయన స్పష్టం చేశారు.
"గత సంవత్సరంలో సంబంధిత చార్టర్డ్ అకౌంటెంట్లు మా క్లయింట్ల వాదనలకు మద్దతు ఇచ్చే అన్ని ఆధారాలతో 15 సార్లకు పైగా పోలీస్ స్టేషన్‌ను వెళ్లారన్నారు. మా క్లయింట్‌లను కించపరచడానికి ఉద్దేశించిన నిరాధారమైన , దురుద్దేశపూరిత కేసు తప్ప మరొకటి కాదన్నారు. ఫిర్యాదు చేసిన వారిపై మా వైపు నుండి తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని " లాయర్ పాటిల్ చెప్పారు.
లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్, ఫిర్యాదుదారు దీపక్ కొఠారి, వ్యాపార విస్తరణ కోసం ఉద్దేశించిన నిధులను వ్యక్తిగత ఉపయోగం కోసం శిల్పాషెట్టి, రాజ్ కుంద్రా మళ్లించారని ఆరోపిస్తున్నారు. రాజేష్ ఆర్య అనే వ్యక్తి తనకు సెలబ్రిటీ జంటకు పరిచయం చేశాడని, ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు. ఇది ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ అని.. ఇందులో ఈ జంటకు కలిపి 87.6 శాతం వాటా ఉందని చెప్పారన్నారు.
మొదట్లో మోసం, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్ల కింద జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కేసు ఆర్థిక పరిమాణం రూ. 10 కోట్లు దాటినందున, ప్రాథమిక విచారణ తర్వాత దర్యాప్తును EOW కి బదిలీ చేశారు. శిల్పాషెట్టి , రాజ్ కుంద్రా మొదట్లో 12 శాతం వడ్డీకి రూ. 75 కోట్ల రుణం కోరారని, కానీ తరువాత పన్నును తప్పించుకోవడానికి పెట్టుబడిగా రూపొందించమని కోరారని కొఠారి ఫిర్యాదులో చెప్పాడు. ప్రతిగా, వారు నెలవారీ రాబడితో పాటు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అసలు చెల్లించలేదంటున్నారు.





















