Actress Kanchana: పెళ్లి చేసుకోవాలనుకున్నా- చిరవకు ఆ ఆలోచననే చంపేసుకున్నా: నటి కాంచన
పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడపాలని ఉన్నా, ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందని చెప్పింది సీనియర్ నటి కాంచన. నమ్మిన వాళ్లే తనను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేసింది.
Actress Kanchana About Family Struggles: తెలుగు వెండితెరపై ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించిన అలనాటి అందాల తార కాంచన. దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో మంది అగ్రతారలతో కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. ఒకప్పుడు రాజ భోగాలు అనుభవించిన ఈ నటీమణి ప్రస్తుతం బంధువుల దగ్గర ఉంటూ భగవంతుడి స్మరణలో సమయాన్ని గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు వెల్లడించింది. నమ్మిన వాళ్లే తనను నట్టేటా ముంచారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో మంది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పినా, ఆ ఆలోచనను చంపేసుకున్నట్లు వెల్లడించింది.
నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు
రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి తాను బోలెడు డబ్బు సంపాదించానని కాంచన చెప్పింది. అయితే, తన పిన్ని కొడుకు ఆస్తి కొట్టేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది. అతడికి తన తల్లిదండ్రులు కూడా సపోర్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. “కష్టాల్లో ఉన్న మా పేరెంట్స్ కు నేను అండగా ఉన్నాను. కొడుకు మాదిరిగా ముందు నిలబడి కష్టపడి డబ్బు సంపాదించాను. కానీ, నా ఆస్తిని మా పిన్ని కొడుకు కొట్టేసేందుకు ప్రయత్నించాడు. నా పేరెంట్స్ కూడా తనకే సపోర్టుగా ఉండటం ఆశ్చర్యం కలిగింది. బాధేసింది. ఎవరి కోసం కష్టపడ్డానో వాళ్లే నాకు అండగా నిలవలేదు. నా మాటను మించి వేరే వాళ్ల మాటలను నమ్మారు. ఆ సమయంలో నేను వాళ్లకు ఎదురు తిరగకపోవడం తప్పు అయ్యింది. వాళ్లు మారుతారేమోనని భావించాను. కానీ, వారిలో మార్పు రాలేదు. చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. ఎవరి ఖర్మ వాళ్లు అనుభవించక తప్పదు అనుకున్నాను. నిజానికి నా కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన మోసానికి ఎప్పుడో గుండె ఆగి చనిపోవాలి. కానీ, తట్టుకుని నిలబడ్డాను” అని చెప్పుకొచ్చింది.
పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను చంపుకున్నాను
అందరి లాగే తనకు పెళ్లి చేసుకోవాలని, ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే కోరిక ఉన్నా, పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందన్నారు. “నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ప్రయత్నించారు. వారిలో హీరోలు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఉన్నారు. కానీ, నేను కుటుంబ పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మానేశాను. ఇంకా చెప్పాలంటే చంపుకున్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చాక నా ఆస్తిని దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాను. బ్రహ్మచారిణిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాను” అని వెల్లడించింది.
ప్రకాశం జిల్లా కరవదిలో 1939 ఆగష్టు 16న కాంచన జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టినా, ఆ తర్వాత ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 1970లో ‘ప్రేమించి చూడు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: కోలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్‌లో త్రిష - 'అమ్మోరు తల్లి'గా గ్లామర్ క్వీన్?