Salman Khan: దుబాయ్ లో భార్యాబిడ్డలు.. మండిపడ్డ సల్మాన్ ఖాన్!
సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. అయితే వీటికి తారలు పెద్దగా రెస్పాండ్ అవ్వరు.
బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న టీవీ షోలలో 'పించ్' ఒకటి. ఈ షోకి ప్రముఖ నటుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన రెండో సీజన్ మొదలైంది. దీనికి గెస్ట్ గా తన సోదరుడు సల్మాన్ ఖాన్ ను తీసుకొచ్చారు అర్భాజ్ ఖాన్. ఈ షోలో సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత, సినిమా విషయాల గురించి చర్చించడంతో పాటు వాళ్లపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి మాట్లాడతారు. నిజానికి ఈ షో మెయిన్ థీమ్ కూడా ఇదే అని చెప్పాలి.
సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. అయితే వీటికి తారలు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. తమపై ట్రోలింగ్ జరిగినా లైట్ తీసుకుంటారు. అలాంటి విషయాలనే ఈ షోలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఈ షోలోకి వచ్చిన సల్మాన్ ఖాన్ ను కూడా ఇలాంటి ప్రశ్నలే వేశారు. గతంలో ఓ నెటిజన్ సల్మాన్ ఖాన్ కు దుబాయ్ లో నూర్ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ నిజమేనా అని ప్రశ్నించారు అర్భాజ్ ఖాన్.
దీనిపై మండిపడ్డ సల్మాన్ ఖాన్ ఘాటుగా బదులిచ్చారు. వీరందరికీ ఇలాంటి తప్పుడు సమాచారం ఎక్కడ నుండి వస్తుందో తెలియడం లేదని.. ఇవన్నీ పనికిమాలిన మాటలని.. ఇలాంటివి రాసి, పోస్ట్ చేసి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. తనకు సంబంధం లేని విషయాలపై స్పందించాలని ఎలా ఆశిస్తారో అంటూ మండిపడ్డారు. ఇప్పుడు వారందరినీ నాకు భార్య లేదు, నేను ఇండియాలో గెలాక్సీ అపార్ట్మెంట్ లో జీవిస్తుంటానని చెప్పాలా..? అంటూ సెటైర్ వేశారు.
తనకు తొమ్మిదేళ్ల వయసు నుండి ఇండియాలోనే గెలాక్సీ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నట్లు అందరికీ తెలుసని అన్నారు. అలానే మరో ట్వీట్ ను అర్భాజ్ చదివి వినిపించాడు. అందులో సల్మాన్ నకిలీ వ్యక్తి అని అతడు మంచివాడిలా నటిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ.. ''అతడికి ఎక్కడో ఒక చేదు అనుభవం ఎదురై ఉండాలి. ఒకవేళ తన భార్య నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి లేదా తన కూతురు నా సినిమా చూపించాలని పట్టుబట్టి ఉంటారని'' సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సల్మాన్ నటించిన 'రాధె' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో, ఓటీటీలో ఒకేసారి విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సల్మాన్ 'టైగర్ జిందా హై' సినిమా సీక్వెల్ లో నటిస్తున్నారు. అలానే బిగ్ బాస్ సీజన్ 15కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు.