(Source: Poll of Polls)
Kurup Real Story: 38 ఏళ్ల మిస్టరీ.. పోలీసులకు చుక్కలు.. ఎవరీ కురుప్? అసలు ఉన్నాడా? పోయాడా?
1984లో దేశాన్ని కుదిపేసి.. ఇప్పటికీ పోలీసులకు దొరకని సుకుమార కురుప్ పూర్తి కథ.
1984 జనవరి.. కేరళలోని అలప్పుళా జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం.. పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి తన ముందు కనిపించిన సీన్ చూసి బెంబేలెత్తిపోయి చుట్టుపక్కల వాళ్లను పిలుచుకువచ్చాడు. అక్కడ రోడ్డు మీద నుంచి పొలాల్లోకి దూసుకెళ్లి మంటల్లో కాలిపోతున్న ఒక కారు.. ఆ కారు డ్రైవర్ సీట్లో అస్సలు గుర్తు పట్టలేని స్థితిలో ఒక శవం. వెంటనే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు.
అప్పుడు విధుల్లో ఉన్న డీఎస్పీ హరిదాస్ కారు దగ్గరికి వచ్చి మొత్తం పరిశీలించాడు. KLQ 7831 నంబర్‌తో ఉన్న ఆ కారులో ఉన్న శవాన్ని అక్కడ నుంచి తరలించి కేసు నమోదు చేశారు. ఆరోజు వాళ్లకి తెలీదు. తాము తెరవబోయే కేసు దేశాన్నే ఒక ఊపు ఊపుతుందని? ఆ కేసు తమను పీడకలలా పట్టి పీడిస్తుందని?
ఆ కారు విదేశాల్లో ఉండే సుకుమార కురుప్ పేరు మీద ఉంది. కొన్నాళ్ల క్రితం కురుప్ ఊరికి వచ్చాడని, అయితే ఆ ప్రమాదం జరిగిన నాటి నుంచి ఊరిలో కనిపించలేదని తెలిసింది. దీంతో కారులో ఉన్న శవం కురుప్‌దేనని అందరూ అనుకున్నారు. అయితే డీఎస్పీ హరిదాస్ మాత్రం ఆ థియరీని మొదటి నుంచి నమ్మలేదు. ఘటనా స్థలంలో హ్యాండ్ గ్లోవ్స్, పెట్రోల్ క్యాన్ దొరికాయి. పోస్టుమార్టం చేసిన డాక్టరు కూడా చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదని, చంపేసిన తర్వాతనే కారులో ఎక్కించి యాక్సిడెంట్ చేయడం లేదా కాల్చేయడం వంటి విషయాలు జరిగాయని చెప్పారు.
కురుప్ కుటుంబ సభ్యులు మృతదేహం అతనిదేనని ధ్రువీకరించారు. కురుప్‌కు వరుసకు తమ్ముడు అయ్యే భాస్కరన్, అతని భార్య వచ్చారు. శవాన్ని చూసి ఏడ్చారు. ఒడ్డూ పొడవూ బట్టి చూస్తే శవం సుకుమార్‌దేనని ఏడుస్తూ చెప్పాడు భాస్కరన్. శవాన్ని దహనం చేయవద్దని, పాతిపెట్టండి అని ప్రత్యేకంగా చెప్పారు హరిదాస్.
విషయం మొత్తం గమనించాక హరిదాస్‌కు మొదటి అనుమానం భాస్కరన్ మీదనే వచ్చింది. తన చేతులు కాలి ఉండటం, కురుప్ చనిపోయిన రోజు భాస్కరన్ ఇంట్లో చికెన్ వండటం వంటి విషయాలు గమనించిన పోలీసులు భాస్కరన్‌కు తమ స్టైల్‌లో ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో.. కురుప్‌ను తనే చంపేశానని ఒప్పుకున్నాడు. గల్ఫ్‌లో ఉన్నప్పుడు తమ మధ్య జరిగిన గొడవల కారణంగా చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు.
అయితే భాస్కరన్ చెప్పిన దానికి, జరిగిన సంఘటనలకు మధ్య పొంతన లేకపోవడంతో మరింత ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఇదే క్రమంలో కురుప్ డ్రైవర్ పొన్నప్పన్ కూడా కనిపించకుండా పోయాడని కనిపెట్టారు. కనిపించకుండా పోయిన పొన్నప్పన్ మాత్రం.. రోడ్డు మీద యాక్సిడెంట్ చేశానని, ఆ మృతదేహాన్ని కారులో పెట్టి కాల్చేశానని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసుల ముందు మరిన్ని ప్రశ్నలు నిలుచున్నాయి.
ఇలా కాదని మరో సుకుమార్‌తో పాటు ఇండియాకు వచ్చిన సాహు మీద పోలీసులు నిఘా పెట్టారు. గల్ఫ్‌కు వెళ్లడానికి ఒక్కరోజు ముందు తనని పట్టుకుని పోలీస్ ట్రీట్‌మెంట్ ఇస్తే అప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. ఇంతకీ అసలు ఆ కారులో తగలబడిన శవం ఎవరిది?
Chapter Chacko
అదే ప్రాంతానికి చెందిన చాకో ఒక సినిమా రిప్రజంటేటివ్. తనది చాలా మామూలు జీవితం. ఆరు నెలల గర్భంతో ఉన్న భార్య తన కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పటిలాగానే అప్పుడు కూడా వెళ్లొస్తానంటూ తన భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు చాకో. సినిమా పని మీద కరువట్టాలోని థియేటర్‌కి వెళ్లడానికి చాకో బయటకు వెళ్లాడు. ఎప్పటిలాగానే థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ తన పని కూడా పూర్తి చేసుకున్నాడు.
వెళ్లిన పని అయిపోయినప్పటికీ హాల్ ఓనర్ కొడుకుతో చాలా సేపు మాట్లాడుతూ ఉండిపోయాడు. ఇదే సమయంలో లాస్ట్ బస్ కూడా వెళ్లిపోయింది. దీంతో ఇక్కడే ఉండి రేపు పొద్దున వెళ్లమని హాలు ఓనర్ కొడుకు చెప్పాడు. కానీ పొద్దున భార్యను చర్చికి తీసుకు వెళ్లాల్సి ఉండటంతో.. నేను ఎలాగోలా వెళ్తానంటూ బయలుదేరి వెళ్లిపోయాడు చాకో. అదే తను చేసిన అతిపెద్ద తప్పు.
రోడ్డెక్కిన చాకో వచ్చే పోయే వాహనాలను లిఫ్ట్ అడగటం మొదలుపెట్టాడు. ఇంతలో భాస్కరన్, పొన్నప్పన్, సాహులు చాకోను చూసి బండి ఆపారు. లిఫ్ట్ ఇస్తామంటూ కారు ఎక్కించుకున్నారు. దారిమధ్యలో తనకు బలవంతంగా మద్యం తాగించి, మెడకు తాడు బిగించి చంపేశారు. తనని కురుప్ కారులో పెట్టి కాల్చేశారు.
కారు తగలబడినబోయిన కేసు విచారిస్తూ.. అంతకు ముందు మిస్సయిన వ్యక్తుల జాబితాను పరిశీలించినప్పుడు పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టారు. చనిపోయింది కురుప్ కాకపోతే.. కురుప్ ఏమయ్యాడు? అసలు చాకోను చంపాల్సిన అవసరం భాస్కరన్, పొన్నప్పన్, సాహులకు ఎందుకు వచ్చింది?
Chapter Sukumara Kurup
సుకుమార కురుప్ గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. మిడిల్‌క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన కురుప్ అసలు పేరు గోపాలకృష్ణ పిళ్లయ్..చదువయ్యాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. అయితే ఏం అయిందో తెలియదు కానీ లాంగ్‌లీవ్ పెట్టేసి వెంటనే ఇంటికొచ్చేశాడు. పనిమనిషి కూతురు సరసమ్మను ప్రేమించి ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అక్కడ అందరికీ తన పేరును సుకుమార కురుప్ అని చెప్పుకున్నాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు అబుదాబి వెళ్లి అక్కడ ఓ మెరైన్ ఆపరేటింగ్ కంపెనీలో చేరాడు. కొన్నాళ్లు అయ్యాక సరసమ్మను రప్పించుకున్నాడు. అప్పట్లోనే ఇద్దరి జీతాలు కలిపి రూ.60 వేల వరకు వచ్చేవి. సరసమ్మ కారణంగా ఆమె చెల్లిలి కుటుంబం కూడా బాగుపడింది. ఆ క్రమంలోనే సరసమ్మ చెల్లెలు భర్త భర్త భాస్కరన్ పిళ్లయ్‌కి సుకుమార్‌కి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అయితే సుకుమార్ అంత సంపాదిస్తున్నా తల్లిదండ్రులు మాత్రం తనను దగ్గరకు రానివ్వలేదు. అప్పుడప్పుడు కేరళకు వెళుతుండే కురుప్ కూడా ఇంటికెళ్లేవాడు కాదు. అలప్పుళాలోని అంబళపుళ ప్రాంతంలో ఓ పెద్ద ఇంటిని కట్టుకోవాలని అనుకున్నాడు. ఇంటి నిర్మాణ పనులను కూడా భాస్కరన్‌కే అప్పగించాడు.
ఇంతలోనే కురుప్ నెత్తిమీద భారీ బాంబు. గల్ఫ్‌లో కంపెనీలు పెద్ద జీతాలవాళ్లను ఉద్యోగాల్లోంచి తీసేసి వారి స్థానంలో తక్కువ జీతాలతో కొత్తవారిని తీసుకోవడం ప్రారంభించాయి. సుకుమార్ పని చేసే కంపెనీ కూడా అదే ఆలోచనలో ఉండటంతో తనకు భయం వేసింది. ఉద్యోగం వదిలేసి కేరళకు వెళ్లి ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నాడు. అదే మాటలో భార్యకు చెప్పాడు. ఇప్పటికే తమ సేవింగ్స్ అన్నీ అయిపోయాయని, డబ్బు లేకుండా ఏమీ చేయలేమని సరసమ్మ అంది.
దీంతో అర్జెంట్‌గా డబ్బు సంపాదించడం ఎలా అన్నది ఆలోచించసాగాడు సుకుమార్. అప్పుడే జర్మనీలో జరిగిన ఇన్సూరెన్స్ ఫ్రాడ్ గురించిన వార్త చూశాడు. సుకుమార్ కురుప్‌కు ఈ ప్లాన్ తెగ నచ్చేసింది. వార్తలో ఉన్న వ్యక్తి తప్పు చేసి దొరికిపోయాడు కానీ తాను అలాంటి పొరపాటు అస్సలు చేయనన్నది సుకుమార్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే అప్పటికే గోపాలకృష్ణ పిళ్లయ్‌గా తను చనిపోయినట్లు సొంత ఊర్లోనే మేనేజ్ చేశాడు.
ఈ ఆలోచనను సాహుతో చెప్పాడు. సాహూ కూడా ఇందులో రిస్క్ ఏమీ లేదని, ఈ పనిలో సాయం చేసినందుకు తనకు కొంచెం డబ్బులు కావాలని అడిగాడు. దీనికి సుకుమార్ సరే అన్నాడు. తర్వాత ఈ ప్లాన్‌లో భాస్కరన్, పొన్నప్పన్ కూడా చేరారు.
ప్లాన్‌పై నమ్మకం రాగానే సుకుమార్ మూడు లక్షల దిర్హామ్‌లతో(మన కరెన్సీలో రూ.30 లక్షలు) ఓ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. సుకుమార్, సాహూ ఉద్యోగాలకు సెలవు పెట్టేసి 1984 జనవరి మొదటి వారంలోనే త్రివేండ్రం వచ్చేశారు. ఆల్రెడీ చనిపోయిన శవాన్ని కాల్చేసి కురుప్‌దిగా నమ్మించాలనేది మొదట వారి ప్లాన్.
దీనికోసం హాస్పిటల్ మార్చురీలు, సమాధులు అన్నీ వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. ఎందుకంటే శవం తాజాగా ఉండటంతో పాటు సుకుమార్‌తో పోలిక కుదరాలి. రెండు వారాలయ్యేసరికి అందరికీ విసుగొచ్చేసింది. దీంతో రోడ్డు మీద ఎవరైనా నా పోలికలతో కనిపిస్తే.. తీసుకొచ్చి సైలెంట్‌గా చంపేద్దాం అన్నాడు కురుప్. మొదట ఆలోచించినా.. తర్వాత అందరూ అదే సరైన ఐడియా అని నమ్మారు.
కురుప్ పోలికలు ఉన్న మనిషి కోసం రాత్రిపూట కారేసుకుని తిరుగుతూ వెతికారు. జనవరి 21వ తేదీన రాత్రి పూట 11 గంటలకు రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతున్న చాకో కనిపించాడు. అతడికి కురుప్ పోలికలు ఉన్నాయి. అతడి దగ్గరకు వెళ్లి కారులోకి ఎక్కించుకున్నారు. ఈథర్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించారు. అతడు స్పృహ కోల్పోగానే టవల్‌తో గొంతు నొక్కేసి ప్రాణాలు తీశారు.
చాకో చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని భాస్కరన్ ఇంటికి తీసుకెళ్లారు. చాకో డెడ్‌బాడీ చేతికి వున్న వాచీ, ఉంగరాన్ని తీసేశారు. కురుప్ బట్టలు తొడిగారు. ముందుగా మొహమంతా కాల్చేశారు. తర్వాత కారు డిక్కీలో శవాన్ని కుక్కి తన్ని పొలానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత పాతకారు డ్రైవింగ్ సీటులో శవాన్ని పెట్టి, కారుపై పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆ మంటల్లో భాస్కరన్ చేయి కాలింది. భాస్కరన్ ఇంటికొచ్చారు కానీ కంగారులో చెప్పులు, అగ్గిపెట్టే అక్కడే వదిలేసి వచ్చారు.
ఈ విషయాలన్నీ పోలీస్ విచారణలో తేలాయి. 1984 ఫిబ్రవరి 1వ తేదీన అప్పుడే వచ్చిన కొత్త టెక్నాలజీ సూపర్ ఇంపోజింగ్ ద్వారా ఆ శవం చాకోదేనని తేచ్చారు. భాస్కరన్, పొన్నప్పన్‌లపై కేసులు పెట్టారు. అప్రూవర్‌గా మారిన సాహూను వదిలేశారు. హత్యకు సహకరించినందుకు కురుప్ భార్య, భాస్కరన్ భార్యలపై కూడా కేసు పెట్టారు కానీ రుజువులు దొరకలేదు. భాస్కరన్, పొన్నప్పన్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
కురుప్ ఏమయ్యాడు?
ప్రధాన నిందితుడు కురుప్ కోసం పోలీసులు విస్తృతంగా వెతకడం మొదలు పెట్టారు. దొరికినట్లే దొరికి తప్పించుకుంటూ ఉండటంతో పోలీసులకు పంతం మరింత పెరిగింది. సుకుమార్ ఫొటోను పత్రికల్లో ప్రచురించారు. వివరాలు తెలిపిన వారికి బహుమతులిస్తామన్నారు. కానీ ఎంత వెతికినా సుకుమార్ నీడను కూడా కనిపెట్టలేకపోయారు. సుకుమార్ తల్లిదండ్రుల ఇంటి దగ్గర నలుగురు అండర్‌కవర్ పోలీసులను ఎనిమిదేళ్లు కాపలా పెట్టినా ఫలితం లేకపోయింది.
మనదేశంలోని అలువా, చెన్నయ్, భూటాన్, అండమాన్, గ్వాలియర్, భోపాల్‌లతో పాటు.. దుబాయ్, అమెరికాలోని లాస్ వెగాస్‌ల్లో కూడా పోలీసులు వెతికారు. పోలీసు శాఖ ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా మారిపోవడంతో అతని కోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది.
కురుప్ ఇప్పుడు బతికి ఉంటే తనకు 74 ఏళ్లు ఉండవచ్చు. 1990లో కురుప్‌ను అబ్‌స్కాండర్‌గా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు అతడి ఆస్తులను కూడా జప్తు చేసింది. భార్య సరసమ్మకు అబుధాబిలో ఉద్యోగం పోయింది. ఇక్కడికి వస్తే కుటుంబం కూడా ఆమెను దగ్గరకు రానివ్వలేదు. సాహూ తిరిగి అబుదాభికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. పొన్నప్పన్ జైలు నుంచి బయటకు వచ్చాక ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కరన్ పులియూరులోనే ఉంటున్నాడు.
కురుప్ ఎక్కడో అక్కడ బతికే ఉన్నాడన్నది కుటుంబ సభ్యుల నమ్మకం. 38 ఏళ్ల నుంచి తను ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. భారతదేశంలో ఎక్కువ కాలం పోలీసులకు దొరకకుండా ఉన్న నేరస్తుడు కురూపే. ఇంత తెలివైన నేరస్తుడు కాబట్టే.. ఇతని మీద ప్రజలకు కూడా ఎంతో ఆసక్తి ఏర్పడింది.
సినిమాలో ఏం చూపించారు?
కురుప్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను కూడా తీశారు. ఈ సినిమా పేరే ‘కురుప్’. ఇందులో టైటిల్ రోల్‌ను ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పోషించాడు. కురుప్ గురించి ప్రచారంలో ఉన్న కథలకు కొంత కల్పనను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు.
కురుప్ పాత్రలో దుల్కర్, తన భార్య పాత్రలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించారు. కీలకమైన చాకో పాత్రలో మరో మలయాళ హీరో టొవినో థామస్, చాకో భార్య పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా దూసుకుపోతుండటంతో కురుప్ కథపై ప్రజలకు ఆసక్తి పెరిగింది.