Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ విడుదల వాయిదా... ఎందుకు? బాలయ్య సినిమా డిజిటల్ తెరపైకి వచ్చేది ఎప్పుడు?
Akhanda 2 OTT Release Date: థియేటర్లలో డిసెంబర్ 5న విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఓటీటీ విడుదల వాయిదా పడింది. డిజిటల్ తెరపైకి సినిమా వచ్చేది ఎప్పుడో తెలుసా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అఖండ 2'. సింహా, లెజెండ్, అఖండ తర్వాత స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన చేసిన నాలుగో చిత్రం ఇది. అయితే డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. అయితే అభిమానులను సినిమా అలరించింది. వాళ్ళతో పాటు థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్ళు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ వాయిదా పడిందట.
ఓటీటీలో 'అఖండ 2' ఎప్పుడు విడుదల అవుతుంది?
'అఖండ 2' ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జనవరి 9న డిజిటల్ ప్లాట్‌ఫామ్ విడుదల తేదీ ఖరారు చేశారు. అలాగని నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీని ధృవీకరిస్తూ అధికారిక పోస్టర్ లేదా ప్రకటన విడుదల చేయలేదు. కానీ సినిమా పేరు మొదట సెర్చ్ చేసినప్పుడు నెట్‌ఫ్లిక్స్ (యాప్) కేటలాగ్‌లో కనిపించింది. దీంతో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతుందని చాలా మంది భావించారు. అయితే, ఇప్పుడు ఆ కేటలాగ్ నుండి 'అఖండ 2' పేరును తీసేశారు. గతంలో యాక్టివ్‌గా ఉన్న లింక్ ఇప్పుడు సినిమాకు రీ డైరెక్ట్ అవ్వడం లేదు. దీంతో 'అఖండ 2' ఓటీటీ విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
'అఖండ 2' బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 'అఖండ 2' కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. సినిమా విడుదలై 23 రోజులు కావడంతో ఇండియాలో రోజుకు సుమారు 25 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేస్తోంది. ఇండియాలో సినిమా నెట్ కలెక్షన్ ఇప్పుడు 93.65 కోట్ల రూపాయలకు చేరుకుంది. సైకానిల్క్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం... మూడవ వారంలో 4.1 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. టోటల్ కలెక్షన్స్ చూస్తే... 'అఖండ 2' నెమ్మదిగా 100 కోట్ల రూపాయల మార్కు దాటింది. పాన్ ఇండియా రిలీజ్ అయిన 'అఖండ 2'లో ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలి మల్హోత్రా, సస్వత ఛటర్జీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని రామ్ అచంట, గోపి అచంట నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.
Also Read: Tamannaah Bhatia: గోవా క్లబ్‌లో తమన్నా డ్యాన్స్... నిమిషానికి కోటి - టోటల్ 6 కోట్లు తీసుకుందట
'అఖండ 2' కథ ఏమిటి? సినిమాలో ఏం చూపించారు?
మహాకుంభ మేళ నేపథ్యంలో 'అఖండ 2 తాండవం' రూపొందించారు. ఒక చైనీస్ ఆర్మీ అధికారి మహాకుంభ మేళాలో గుమిగూడిన భారీ జన సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని బయోవార్ ప్లాన్ చేస్తాడు. మరోవైపు డాక్టర్ జానకి (హర్షాలి మల్హోత్రా) ఈ దాడిని ఆపడానికి యాంటీడోట్ తయారు చేయడంలో నిమగ్నమై ఉంది. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు ప్రాణహాని బెదిరింపులు వస్తాయి. అప్పుడు అఖండ యోధుడు రుద్ర సికందర్ అఘోరా ఆమెను రక్షించడానికి ముందుకు వస్తాడు. అతనితో పాటు అతని కవల సోదరుడు మురళి కృష్ణ కూడా ఉంటాడు. దేశం కోసం వాళ్లు ఎటువంటి పోరాటం చేశారు? అనేది సినిమా.





















