Squid Game in North Korea: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
శత్రు దేశానికి చెందిన ‘స్క్విడ్ గేమ్’ చిత్రాన్ని దొంగచాటుగా దేశంలోకి తరలించడమే ఆ విద్యార్థి చేసిన తప్పు. ఇందుకు అక్కడి ప్రభుత్వం ఎంత కఠిన శిక్ష విధించిందో చూడండి.
Squid Game (స్కిడ్ గేమ్).. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు మెచ్చిన వెబ్ సీరిస్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. పిల్లలు ఆడే చిన్న ఆటను పెద్దలతో ఆడితే? ఔటయ్యే వ్యక్తిని ఈ భూమి మీద లేకుండా లేపేస్తే? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వెబ్‌సీరిస్ అందరికీ తెగ నచ్చేస్తోంది.జీవితంలో సర్వం కోల్పోయి.. సాయం కోసం ఎదురుచూసే పేదవాడికి బోలెడంత డబ్బును ఆశ చూపించి.. సంపన్నులు ఆడే ఈ ప్రాణాంతకమైన క్రీడను చూస్తే మనసు బరువెక్కుతుంది. అందుకే.. ఈ చిత్రం ఎంతోమందికి దగ్గరైంది.
దక్షిణ కొరియాకు చెందిన ఈ వెబ్‌సీరిస్‌ను.. పొరుగు దేశమైన ఉత్తర కొరియాలోని ప్రజలు కూడా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఆ ఆశే ఇప్పుడు ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. సాధారణంగా ఉత్తర కొరియాలో టీవీలు ఉన్నా.. ఎంటర్‌టైన్మెంట్, న్యూస్ చానెళ్లు ఉండవు. కేవలం ప్రభుత్వం ప్రసారం చేసే కార్యక్రమాలే చూడాలి. చివరికి రేడియో వినేందుకు కూడా స్వేచ్ఛ లేదు. అంతర్జాతీయ సమాచారం తెలుసుకోవడం, ఇతర దేశాల టీవీ సీరియళ్లు, సినిమాలు చూడటం నిషేదం. వాటిని అక్రమంగా తరలించినా, దొంగచాటుగా చూసిన శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పేందుకు ఈ తాజా ఘటనే నిదర్శనం.
ఉత్తర కొరియాకు చెందిన హైస్కూల్ విద్యార్థులు ఇటీవల తమ టీచర్స్‌తో కలిసి చైనా వెళ్లారు. వారిలో ఓ విద్యార్థి.. దక్షిణ కొరియాకు చెందిన ‘స్క్విడ్ గేమ్’ను యూఎస్‌బీ పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నాడు. మొత్తానికి ఆ పెన్ డ్రైవ్‌ను భద్రతా అధికారుల కళ్లుగప్పి.. దేశంలోకి తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత ఆ వెబ్‌సీరిస్ కాపీలను తోటి విద్యార్థులకు, ఇతరులకు విక్రయించాడు. ఈ సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి. పరాయి దేశానికి చెందిన వెబ్ సీరిస్‌ను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చినందుకు, ఇతరులకు విక్రయించినందుకు ప్రభుత్వం ఆ యువకుడికి చనిపోయే వరకు జైలు శిక్ష విధించింది. ఆ కాపీని చూసిన మిగతా విద్యార్థులను సైతం తీవ్ర శిక్షలు విధించాలని ఆదేశించింది.
‘రేడియో ఫ్రీ ఆసియా’ సమాచారం ప్రకారం.. వెబ్ సీరిస్‌ను అక్రమంగా తరలించిన యువకుడికి చనిపోయే వరకు శిక్ష విధించింది. మిగతా విద్యార్థులకు ఐదేళ్ల వరకు కూలీ పనుల్లో పాల్గోవాలని కోర్టు ఆదేశించింది. అంతేగాక.. ఆ విద్యార్థులను చైనాకు తీసుకెళ్లి వచ్చిన ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు, స్కూల్ నిర్వాహకులు కూడా దీనికి బాధ్యులేనని పేర్కొంది. అయితే, వారిని ఉద్యోగాల నుంచి మాత్రం తొలగించలేదు. అయితే వారిని బొగ్గు గనుల్లో పనులకు గానీ, దేశంలోని మారుమూల ప్రాంతాలకు గాని వెలివేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
ఉత్తర కొరియా చట్టం ప్రకారం.. స్థానిక సంస్కృతికి భంగం కలిగించినట్లయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు చెందిన మీడియా కార్యక్రమాలు చూసినా, కలిగి ఉన్నా, వాటిని పంపిణీ చేసినా మరణ శిక్ష విధిస్తారు. అయితే, ఈ కేసులో యువకుడు హైస్కూల్ విద్యార్థి కావడంతో చనిపోయేవరకు శిక్ష అమలు చేయాలని కోర్టు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఒక మైనర్‌కు ఇంత కఠిన శిక్ష విధించడం ఆ దేశంలో ఇదే మొదటిసారని సమాచారం.
Also Read: ‘దృశ్యం 2’ రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి