Mansoor Ali Khan: చిరంజీవి, త్రిషాపై దావా - మన్సూర్‌కు కోర్టు చీవాట్లు, లక్ష రూపాయలు కట్టాలని ఆదేశం
Mansoor Ali Khan: తమిళ నటుడు మన్సూర్ అలీపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిందే తప్పు, పైగా పరువు నష్టం దావా వేస్తావా? అంటూ తీవ్రంగా మందలించింది. లక్ష రూపాయులు జరిమానా విధించింది.
Mansoor Ali Khan: గత కొద్ది రోజులుగా తమిళ సినిమా పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు మన్సూర్ అలీ ఖాన్. రీసెంట్ గా నటి త్రిష గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఓపెన్ గా ఆయన చేసిన రేప్ కామెంట్స్ పై త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మహిళా సంఘాలతో పాటు కేంద్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మన్సూర్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో త్రిషకు క్షమాపణలు చెప్పాడు. ఆమె కూడా సారీని యాక్సెప్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సమస్య అక్కడితో అయిపోయినట్లు అందరూ భావించారు. కానీ, ఆయన త్రిషతో పాటు ఆమెకు మద్దతు తెలిపిన సినీ ప్రముఖులపై పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసుపై మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది.
మన్సూర్ ను ఏకిపారేసిన న్యాయస్థానం
మన్సూర్ వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి సహా పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు. త్రిషకు సపోర్టుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా ఉన్న చిరంజీవి, ఖుష్బూపై పరువునష్టం దావా వేశాడు మన్సూర్. అనసవరంగా తనను ఈ వ్యవహారంలో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతేకాదు, తనకు పరువునష్టం కలిగించిన చిరుతో పాటు త్రిష, ఖుష్బు నుంచి తలో కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని కోరాడు.
దీనిపై తాజాగా మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. మన్సూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేసింది. “ఒక నటిపై మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మిగతా నటీటనలు ఖండించారు. ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ఆ సమయంలో ఎవరైనా అలాగే మాట్లాడుతారు. అంతమాత్రాన పరువు నష్టం దావా వేస్తారా? ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా దావా వేయడానికి వీల్లేదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన వ్యవహారంగా కనిపిస్తోంది” అని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేసును కొట్టివేశారు. అంతేకాదు, విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను రూ. లక్ష జరిమానా విధించారు. అయితే, ఈ డబ్బును చెన్నై అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మీడియాతో చిట్ చాట్ లో నోరు జారిన మన్సూర్
రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన ‘లియో’ సినిమా గురించి ప్రస్తావించారు. అందులో భాగంగానే త్రిషతో కలిసి నటించడం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో రేప్ సీన్ చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. “గతంలో నేను చాలా రేప్ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించాను. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై నటి త్రిషతో పాటు పలువురు సౌత్ సినీ ప్రముఖులు స్పందించారు. మన్సూర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..