Lata Mangeshkar: పాటంటే లతాజీ, లతాజీ అంటే పాట-తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ల సంతాపం
ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
గానకోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్ ఇకలేరన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం జగన్ అన్నారు. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు అన్నారు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు.
Deeply anguished to know that Lata Mangeshkar ji is no more with us. Her melodious voice will continue to echo for eternity. May her soul rest in peace.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 6, 2022
పాటంటే లతాజీ .. లతాజీ అంటే పాట : సీఎం కేసీఆర్
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. లతా మంగేష్కర్ ద్వారా దేశానికి గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతాజీ మరణంతో పాట మూగబోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ సరస్వతీ స్వర నిధి అని సీఎం అన్నారు. ఆమె సంగీత మహల్ అని కొనియాడారు. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని అని సీఎం గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాతలు సాధారణంగా మొదట హీరో, హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారని, కానీ సింగర్ గా లతాజీ సమయం ఇచ్చిన తర్వాతే సినిమా షూటింగ్ ప్రారంభించేవారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చన్నారు. లతా దీదీ మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత చరిత్రలో లతా మంగేష్కర్ చేరగని ముద్రవేశారన్నారు.
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. #LataMangeshkar
— Telangana CMO (@TelanganaCMO) February 6, 2022