Nirvanashatakam: సింగర్‌గా మారిన మంచు లక్ష్మి - ‘నిర్వాణ శతకం’ సాంగ్ వైరల్
మహాశివరాత్రి సందర్భంగా మంచు లక్ష్మి రూపొందించిన స్పెషల్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. పరమ శివుడిపై ఆమె పాడిన పాట భక్తులను అలరిస్తోంది. కూతురు విద్యతో లక్ష్మి ఈ పాటను ఆలపించారు.
మంచు లక్ష్మి రూపొందించిన మహా శివరాత్రి ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆది శంకరాచార్యులు రచించిన ‘నిర్వాణశతకం’ ఆలపిస్తూ ఈ వీడియో సాంగ్ ను తెరకెక్కించింది. మంచు లక్ష్మి స్వయంగా పాడిన ఈ పాట వీనుల విందు కలిగిస్తోంది. తన కూతురు విద్యా నిర్వాణ సైతం ఈ పాటలో గొంతు కలిపింది. సంస్కృతంలో ఉన్న ఆ శ్లోకాలకు ఇంగ్లిష్ లో వివరిస్తూ ర్యాప్ చేయడంతో పాటకు మరింత అందం వచ్చింది. అంతేకాదు, పాట కంపోజిషన్ చాలా గొప్పగా ఉంది. ఈ పాటను మంచు లక్ష్మి తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేసింది. 8 నిమిషాలకు పైగా ఉన్న ఈ పరమశివుడి వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఆధ్యాత్మిక శ్లోకం.. మోడ్రన్ కంపోజిషన్
ఒక గొప్ప ఆధ్యాత్మిక శ్లోకాన్ని మోడ్రన్ కంపోజిషన్ లో అందరికీ అర్థం అయ్యేలా, అందరినీ ఆకట్టుకునేలా మంచు లక్ష్మి ఈ పాటను రూపొందించింది. కాశీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించింది. చక్కటి పాటకు తోడు మంచు లక్ష్మి అభినయం వీడియో సాంగ్ కు మరింత రిచ్ నెస్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పాటకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఈ పాటను ప్రశంసిస్తున్నారు. పాట బాగుంది. పాటలో మంచు లక్ష్మి ఒదిగిపోయి నటించిన విధానం బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్‌ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
శివుని గురించి తెలుసుకుంటూ ఈపాట రూపొందించాను- మంచు లక్ష్మి
ఈ పాట గురించి మంచు లక్ష్మి తన అనుభవాలను వివరించింది. “నేను నా కుమార్తె విద్యా నిర్వాణ పుట్టిన సందర్భంగా ఈ పాటను విన్నాను. అప్పుడే నా ఆధ్యాత్మిక ప్రయాణం వేగవంతమైంది. ఆ పాట విన్న తర్వాత నాకు నిర్వాణ అనే పేరు మరింత అర్థమైంది. మనం స్వచ్ఛమైన చైతన్యం, ఆనందం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. నేను కైలాసానికి మూడుసార్లు వెళ్లి పూర్తి పరిక్రమాలు చేశాను. మానస సరోవర్ సరస్సులో స్నానం చేశాను. శివుని గురించి మరింత తెలుసుకోవడం అది శివుని నివాసంగా భావించబడే పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నాను. ఇటీవలే రాజస్థాన్, పాకిస్థాన్, గుజరాత్ సరిహద్దులో ఉన్న భీన్మల్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఇది కేవలం నిర్మలమైన, ఆధ్యాత్మిక అనుభవంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఈ పాటను రూపొందించాను” అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ పాటను కన్ను సమీర్ స్వరపరిచారు. వంశీ గడధాసు కెమెరా మెన్ గా పని చేయగా, శ్రీశైలం దార ఎడిటర్ గా వ్యవహరించారు. మంచు లక్ష్మి ఇంతకు ముందు కూడా ప్లే బ్యాక్ సింగర్ గా చేసింది. ‘దొంగాట’ సినిమాలోని ‘యందీరూ’ అనే పాటకు ఈటీవీ నిర్వహించిన సెలబ్రిటీ సింగర్ అవార్డు అందుకుంది.
అటు మంచు లక్ష్మి ప్రస్తుతం ‘అగ్నినక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజామణి సంగీతం అందిస్తున్నారు.
Read Also: బాలీవుడ్ అగ్ర హీరోయిన్లతో ‘హీరామండి’ ఫస్ట్ గ్లింప్స్ - భన్సాలీ ఎమోషనల్