కృష్ణ పరిచయం చేసిన ‘కౌబాయ్’కు అసలు అర్థం తెలుసా? వాళ్లను అలా ఎందుకు పిలుస్తారు?
కౌబాయ్ అనగానే మనకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాయే గుర్తుస్తుంది. ఆ సినిమాలో కృష్ణ పరిచయం చేసి ‘కౌబాయ్’ ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారో తెలుసా?
మనం సూపర్ స్టార్ కృష్ణను చాలా సినిమాల్లో కౌబాయ్ గెటప్‌లో చూశాం. ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తర్వాత కౌబాయ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆయన కొడుకు మహేష్ బాబు కూడా ‘టక్కరి దొంగ’ సినిమాలో కౌబాయ్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. కౌబాయ్ అనగానే... తలపై టోపీ పెట్టుకొని, గుర్రంపై స్వారీ చేస్తూ... నడుము దగ్గర తుపాకీ పెట్టుకొని.. బ్యాక్రౌండ్ లో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తూ స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడాన్ని మనం చూసే ఉంటాం. మరి, నిజంగా కౌబాయ్స్ అలాగే ఉంటారా? గన్స్ షూటింగ్‌లో కూడా నేర్పరులా? అయితే, మీరు తప్పకుండా ‘కౌబాయ్స్’ గురించి తెలుసుకోవాల్సిందే. కౌబాయ్ అంటే ఎవరు? ఆ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? తదితర వివరాలేమిటో చూద్దాం.
కౌబాయ్ అంటే ఏమిటి?
కౌబాయ్ అంటే పశువుల కాపరి అని అర్థం. అమెరికాలోని గడ్డి భూముల్లో, గుర్రంపై స్వారీ చేస్తూ పశువులను మేపుతూ, సంరక్షించే వ్యక్తిని కౌబాయ్ అని పిలిచేవారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి అమెరికా, ఆస్ట్రేలియాలో పశువుల నిర్వాహకులను కౌబాయ్ అని పిలుస్తారు. కౌబాయ్ గా వుండే వ్యక్తి శారీరక దృఢత్వం, పశువులను మేపడానికి, సంరక్షించడానికి కావాల్సిన అన్నీ నైపుణ్యాలు కలిగి ఉంటాడు. ఎక్కువగా యువకులు కౌబాయ్ గా పని చేస్తుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అంగవైకల్యం లేకుండా వుంటే జీవితాంతం కౌబాయ్ గానే పని చేసే వారు. కొందరు యువతులు కూడా 1900 మొదట్లో గడ్డి భూముల్లో పుశువులను మేపడం ప్రారంభించారు, వారిని కౌగర్ల్స్ అని పిలిచేవారు. వారు కనిపించే స్టైలిష్ లుక్ అప్పట్లో హాలీవుడ్ దర్శకులను ఆకట్టుకుంది. దీంతో 1903లో The Great Train Robbery అనే మూవీని చిత్రీకరించారు. ప్రపంచంలోని తొలి కౌబాయ్ చిత్రం ఇదే. ఆ తర్వాత మరెన్నో కౌబాయ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇండియాలో తొలి కౌబాయ్ చిత్రం కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’.
కౌబాయ్ పదం చరిత్ర ఇదే
కౌబాయ్ అనే పదం గుర్రం ఎక్కి పశువులను కాసే వ్యక్తికి సూచించే పదం. కౌబాయ్ అనే ఆంగ్ల పదం వ్యాకురో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. వాక్కా అనే పదం నుంచి వ్యాకురో ఉద్భవించింది. వాక్కా అనగా ఆవు అనీ అర్థం. ఈ పదాన్ని మొదటగా 1725లో జోనాథన్ స్విఫ్ట్ ముద్రణలో ఉపయోగించారు. బ్రిటిష్ దీవుల్లో 1820 నుంచి 1850 వరకు ఆవులను పోషించే యువకులను సూచించడానికి కౌబాయ్ పదాన్ని వాడేవారు. బకరూ అనేది కౌబాయ్ కి మరో ఆంగ్ల పదం దీనిని ఎక్కువగా గ్రేట్ బేసిన్, కాలిఫోర్నియాలో ఉపయోగిస్తారు. కౌపంచర్ అనే పదాన్ని టెక్సాస్, పరిసర రాష్ట్రాల్లో ఉపయోగిస్తారు.1880లలో అరిజోనాలోని టోంబ్ స్టోన్లో.. కౌబాయ్ అనే పదాన్ని వివిధ నేరాలు చేసి చిక్కిన వ్యక్తుల్ని పిలిచేవారు. కౌబాయ్ అనే పదం అతను గుర్రపుదొంగ, చట్ట విరుద్ధమైన వ్యక్తి అనీ సూచించేవి. అమెరికన్ విప్లవ సమయంలో స్వాతంత్ర్యం కోసం చేసే ఉద్యమాన్ని వ్యతిరేకించిన అమెరికన్ లను కౌబాయ్ అనీ పిలిచేవారు. కౌబాయ్ కి ఇతర పర్యాయ పదాలు రాంచ్ హ్యాండ్, రేంజ్ హ్యాండ్, ట్రైల్ హ్యాండ్.