YouTubers Ban: థియేటర్ల ఆవరణలో యూట్యూబర్స్‌కు ప్రవేశం నిషేదం - ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం
కేరళ ఫిల్మ్ చాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్ల వద్ద రివ్యూ లు తీసుకేనే యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ ఆవరణలో బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.
సమాజంలో సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. అందుకే సినిమాలకు అంత క్రేజ్ ఉంటుంది. నిత్యం వందల సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల అవుతూ ఉంటాయి. ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ ఉంటారు. పూర్వం ఏదైనా సినిమా విడుదలైందంటే.. ఆ సినిమా వందల రోజులు థియేటర్లలో రన్ అవుతూ ఉండేవి. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. అప్పట్లో కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ప్రేక్షకులు సినిమాలు చూసేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. సినిమాల విషయంలో రివ్యూలు వచ్చేశాయి. విడుదల అయిన రోజే సినిమా ఇలా ఉంది, అలా ఉంది అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. వాటికి తోడు సోషల్ మీడియా జోరు పెరగడం కూడా సినిమా నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లు సినిమాల రిలీజ్ రోజు థియేటర్ల ముందు కూర్చుంటున్నారు. సినిమా హాల్ నుంచి ప్రేక్షకులు బయటకు రాగానే వారి నుంచి రివ్యూలు తీసుకుంటున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా కేరళలో యూట్యూబర్స్ పెద్ద తలనొప్పిగా మారారట. దీంతో కేరళ ఫిల్మ్ చాంబర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించే యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ల ఆవరణలోకి రానివ్వకూడదని, వారిపై బ్యాన్ విధిస్తున్నామని ప్రకటించింది.
ప్రస్తుతం కేరళ ఫిల్మ్ చాంబర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సాధారణంగా సినిమా షో ముగిసిన వెంటనే షూట్ చేసే యూట్యూబ్ రివ్యూయర్ లను థియేటర్ల ప్రాంగణంలో నిషేధిస్తామని చెప్పారు. అలాంటి రికార్డింగ్ లు అనుమతించబడవు. కావాలని కొంతమంది కొన్ని సినిమాలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సినిమాల ఆదాయం, ప్రతిష్టలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. అలాగని వారిని రివ్యూలు ఇవ్వద్దొని కాదని, వారు కూడా సినిమా చూసి అప్పుడు రివ్వ్యూ లు ఇస్తే బాగుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఇది ఆచరణాత్మక చర్య కాదని కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ అద్యక్షుడు లిబర్టీ బషీర్ అన్నారు. సినిమా నిజంగా బాగుంటే నెగిటివ్ రివ్వ్యూ లు ప్రభావితం చేయలేవని, సినిమా బ్యాడ్ అయితేనే నెగిటివ్ రివ్య్యూలు వస్తాయని, ఇదేమీ వసూళ్లపై ప్రభావం చూపదని పేర్కొనడం గమనార్హం.
అలాగే సినిమా ఓటీటీ విడుదల విషయంలోనూ మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ పిల్మ్ చాంబర్. దీని ప్రకారం థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీ విడుదలకు 42 రోజులుగా నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమా కాంట్రాక్టులన్నింటికీ ముందుగా నిర్ణయించిన ఈ టైమ్ గ్యాప్ ను పాటించాలని వెల్లడించారు. గతంలో తెలుగు, తమిళ పరిశ్రమల్లో కూడా ఇలాంటి నియమాలు అమలు అయ్యాయి. టాలీవుడ్‌లో 8 నుంచి 4 వారాలు ఇలా సినిమాను బట్టి ఓటీటీ విడుదల సమయాన్ని నిర్ణయించారు. కానీ, అది అమలు కావడం లేదు. థియేటర్లో సినిమా ఆడకపోతే వెంటనే ఓటీటీకి ఇచ్చి సొమ్ముచేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.