(Source: ECI/ABP News/ABP Majha)
Rajamouli Birthday: రూ.12 కోట్లతో మొదలై రూ. 2 వేల కోట్లకు చేరిన ’బాక్సాఫీస్ బాహుబలి’, ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి!
తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు. ఓటమి ఎరుగని దర్శకత్వానికి కేరాఫ్ అడ్రస్. భారత్ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అతడే రాజమౌళి. ఇవాళ ఆ దర్శకధీరుడి పుట్టిన రోజు.
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. 2001లో ‘స్టూడెంట్ నెం 1’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి.. ఆ తర్వాత వరసగా 12 బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజిలో సత్తా చాటారు. ‘బాహుబలి’ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. 2001లో తన తొలి సినిమా స్టూడెంట్ నెం 1తో రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిన రాజమౌళి.. ‘బాహుబలి’ సినిమాతో రూ. 2 వేల కోట్లు సాధించారు. ‘బాక్సాఫీస్ బాహుబలి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘స్టూడెంట్ నంబర్ 1’తో సినీ ప్రయాణం ప్రారంభం
రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. ‘స్టూడెంట్ నంబర్ 1’తో ఆయన సినీ ప్రయాణం మొదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ కావడంతో రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. వరుస విజయాలతో రాజమౌళి టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. నాని హీరోగా వచ్చిన ‘ఈగ’ సినిమాతో మరో అదిరిపోయే హిట్ కొట్టారు. దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో గ్రాఫిక్స్ మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నారు.
‘బాహుబలి’తో ప్రపంచ స్థాయి గుర్తింపు
ఇక రాజమౌళి దశదిశ మార్చిన సినిమా ‘బాహుబలి’. భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విజువల్ వండర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టించింది. సుమారు రూ. 2 వేల కోట్ల రూపాయల గ్రాస్ సాధించి అబ్బుర పరిచింది. దేశ చరిత్రలోనే అత్యుత్తమ బాక్సాఫీస్ రికార్డుగా నిలిచింది. ‘బాహుబలి‘ తర్వాత తెరెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సైతం దేశ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ పై సందడి చేసింది. రాజమౌళి ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.
జక్కన్న మొదలుపెట్టి వదిలేసి సినిమాలు
రాజమౌళి తన కెరీర్ లో పట్టిందల్లా బంగారం అయ్యిందని చెప్పుకోవచ్చు. కానీ, తన తీయాలని భావించి తీయలేకపోయిన రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మైథలాజికల్ డ్రామా తెరకెక్కించాలి అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కావడంతో డ్రాప్ అయ్యారు. అటు రాఘవేంద్రరావు కొడుకు కేఎస్ ప్రకాష్ హీరోగా ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. భారీ బడ్జెట్ తో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ, అనుకున్న బడ్జెట్ కు, అయ్యే ఖర్చుకు పొంతన లేకపోవడంతో ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇదే రాజమౌళి కుటుంబం
ఇక రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే.. ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజా నందినీ కొడుకు రాజమౌళి. ఆయన భార్య రమ. వీరిద్దరిది ప్రేమ వివాహం. రామమౌళితో పెళ్లి కంటే ముందే రమకు మరో వివాహం అయ్యింది. ఆమె కొడుకు కార్తికేయ. కొన్ని గొడవలతో మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రమ, రాజమౌళి ప్రేమించుకున్నారు. 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?
Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్