Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్
'హిట్ 2' సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్న అడివి శేష్, ఇటీవల సైంటిఫిక్ థ్రిల్లర్ 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేశారు.
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎంతవారు గాని' (Enthavaarugaani Movie). రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఎవరో కాదు... నివాస్ పేరుతో ప్రేక్షకులకు సుపరిచితులైన ఎడిటర్ & సౌండ్ ఇంజినీర్. దర్శకుడిగా ఆయన తొలి సినిమా టీజర్‌ను అడివి శేష్ (Adivi Sesh) విడుదల చేశారు.
ఎంతవారు గాని టీజర్ ఎలా ఉందేంటి?
Enthavaarugaani Teaser Review : 'ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలో నీకు తెలుసు' అని తెల్లకోటు వేసుకున్న ఓ మహిళ, మరొక మహిళకు చెప్పే డైలాగుతో 'ఎంతవారు గాని' టీజర్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళిద్దరూ ఒక ల్యాబ్ (ప్రయోగశాల)లో ఉన్నారని అర్థం అవుతుంది. అయితే... ఏం ప్రయోగం చేశారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో రొమాన్స్ ఉంది. లిప్ లాక్స్ ఉన్నాయి. మర్డర్ మిస్టరీ ఉంది. ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయి. థ్రిల్ ఉంది. చాలా మంది నటీనటులు ఉన్నారు. 'దాని ఎక్స్‌పరిమెంటే దాని ప్రపంచం' అని నటుడు అప్పాజీ అంబరీష ఓ డైలాగ్ చెబుతారు. అసలు, ఆ ప్రయోగం ఏంటి? అనేది మాత్రం చెప్పలేదు.
'నువ్వు ఏమైనా చెప్పు... అతడు మాత్రం నన్ను వదిలిపెట్టడు' అని తన ప్రియుడి గురించి, అతడు చూపించే ప్రేమ గురించి ఓ అమ్మాయి చెప్పడం... 'సిగ్గు ఏమీ వేయడం లేదా నీకు? ఇన్ని రోజులు బయట చేశావ్. ఇప్పుడు ఇంటికి తీసుకోవచ్చావ్' అని భర్తపై భార్య ఆగ్రహం వ్యక్తం చేయడం... 'నేను ఏమీ తప్పు చేశానని అనుకోవడం లేదు... మా ఇద్దరికీ ఒకరు అంటే మరొకరికి ఇష్టం' అని మరో అమ్మాయి డైలాగ్ చెప్పడం... కథపై ఆసక్తి రేపాయి.
ఓ అమ్మాయి మర్డర్స్ చేయడం కూడా చూపించారు. ఎవరిని హత్య చేసింది? ఎందుకు చేసింది? అంజలి కనపడటం లేదని పీజీ నుంచి కంప్లైంట్ వచ్చినట్టు ఓ మహిళ చెబుతుంది? అసలు, ఆ అంజలి ఎవరు? 'మనం ఎస్కెప్ అవ్వాలంటే ఈ చావును దాచి పెట్టాలి' అని హీరోయిన్ ఎందుకు చెబుతుంది? చావు బతుకులు మధ్య ఎటువంటి ఆట జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి చేసుకోవాలి.
'ఎంతవారు గాని' సైంటిఫిక్ థ్రిల్లర్ అని చిత్ర బృందం పేర్కొంది. టీజర్ తనకు నచ్చిందని, డిఫరెంట్ పాయింట్‌తో తీసినట్టు అర్థం అవుతోందని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు అడివి శేష్ తెలిపారు.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
శ్రీనివాసన్. ఎన్ (Sriniwaas N) ను నివాస్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఎడిటర్ గా పరిచయం చేశారు. నివాస్ పని చేసిన తొలి సినిమా 'రంగీలా'.ఆ తర్వాత వర్మ 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి', 'అంతం', 'ద్రోహి', 'మనీ', 'అనగనగ ఒక రోజు', 'మృగం', 'రాత్', 'మనీ మనీ' తదితర సినిమాలకు సౌండ్ ఇంజినీర్ గా పని చేశారు. పలు అవార్డులు అందుకున్నారు.
'ఎంతవారు గాని' సినిమాకు ప్రవీణ్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. జె.కె. మూర్తి ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చూసుకోగా... ఘ్యాని నేపథ్య సంగీతం అందించారు