(Source: ECI/ABP News/ABP Majha)
Atrocity Case: దళితులపై ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు, కర్నాటక హైకోర్టు ఏం చెప్పిందంటే?
కన్నడ నటుడు ఉపేంద్రకు కర్నాటక హైకోర్టులో రిలీఫ్ లభించింది. దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
దళితులపై వివాదాస్పవ వ్యాఖ్యల నేపథ్యంలో ఉపేంద్ర చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు ఫిర్యాదులు చేశాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాది కోర్టుకు పలు వివరాలు వెల్లడించారు. ఉపేంద్రకు దళితుల పట్ల ఎలాంటి చులకన భావం లేదని తెలిపారు. ఆయన అన్ని వర్గాలను గౌరవిస్తారని చెప్పారు. చాలా కాలంగా ఉన్న సామెతను వాడారే తప్ప, ఇతరులను ఇబ్బంది పెట్టాలనేది ఆయన ఉద్దేశం కాదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, ఉపేంద్రపై నమోదైన కేసులపై స్టే విధించారు.
వివాదానికి అసలు కారణం ఏంటంటే?
గత వారం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అభిమానులతో ఉపేంద్ర ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. లైవ్‌లో కొన్ని ప్రశ్నలు అడిగారు. తాను స్థాపించిన రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ, ఉపేంద్ర ఓ సామెత వాడారు. అది దళితులను కించపరిచేలా ఉందంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. బెంగళూరు, మండ్య, కోలారులో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయి. దళిత సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ వివాదం చల్లారలేదు.
ఉపేంద్రకు పోలీసుల నోటీసులు
ఇక ఉపేంద్రపై నమోదైన కేసులపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే, ఆయనకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపేంద్రకు చెందిన రెండు ఇండ్లకు నోటీసులు అంటించారు. అటు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. ఇక ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులను ఒకే చోటుకు బదిలీ చేసి విచారణ చేసేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఉపేంద్ర వ్యాఖ్యలపై కన్నడ మంత్రి ఆగ్రహం
ఉపేంద్ర వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సామాజికి సంక్షేమ మంత్ర మహదేవప్ప తప్పుబట్టారు. ఓ కులాన్ని అవమాన పరిచేలా మాట్లాడ్డం మంచి పద్దతి కాదని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేయాలి అనుకునేవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర్య భారతంలో ఇప్పటికీ అణగారిన వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు తగవని చెప్పారు. ఇప్పటికైనా ఆయన పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.
నటుడిగా అద్భుత చిత్రాలు చేసిన ఉపేంద్ర
ఇక ఉపేంద్ర గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎన్నో అద్భుత చిత్రాలు చేశారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. పాన్ ఇండియా ట్రెండ్ ప్రారంభం కాకముందే ఆయన ఆయన ఎన్నో పాన్ ఇండియన్ చిత్రాల్లో నటించారు. 90వ దశకంలోనే రోబోట్స్ పై సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రస్తుతం ‘యూఐ’ అనే సినిమాలో నటిస్తున్నారు.
Read Also: 'మేడ్ ఇన్ హెవెన్'లో మృణాల్ అద్భుత నటన- ప్రశంసలు కురిపిస్తున్న విమర్శకులు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial