Sarath Babu Properties: శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరు? వీలునామాలో ఏం రాశారు?
నటుడు శరత్ బాబు మరణం తర్వాత ఆయన ఆస్తులకు వారసులు ఎవరనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు శరత్ బాబు వీలునామా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాదాపు ఐదు దశాబ్దాలు సినీ ప్రస్థానం కొనసాగించిన సీనియర్ నటుడు శరత్ బాబు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ప్రేక్షకులను అలరించారు. కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుడు ఇటీవలే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో శరత్ బాబు వ్యక్తిగత విషయాలు, ఆస్తిపాస్తులు, వారసుల గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సోదరుడు మధు దీక్షితులు మాట్లాడుతూ.. తాము మొత్తం ఎనిమిది మంది అన్నదమ్ములమని, అందులో శరత్ బాబు మూడో వాడని, తమకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారని చెప్పారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తమ ఫ్యామిలీకి శరత్ బాబే పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారని తెలిపారు. కష్టసుఖాల్లో తోడుగా ఉండటమే కాదు, తప్పు ఒప్పులను తెలియజెప్పేవాడని అన్నారు. పిల్లల చదువులకు సహాయం చేసేవాడని, ఆర్థికంగా ఆదుకున్నాడన్నారు. ఆయన తమకు బ్రదర్ మాత్రమే కాదని, ఒక గాడ్ ఫాదర్ అని అన్నారు.
శరత్ బాబు తమకు తండ్రి స్థానంలో ఉండటంతో, వివాహాలు విడాకులు వంటి ఆయన వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని మధు చెప్పారు. శరత్ బాబు ఏదైనా వీలునామా రాసిపెట్టి ఉంటే, దాని ప్రకారమే ఆస్తి పంపకాలు జరుగుతాయన్నారు. తాము ఎప్పటి నుంచో జాయింట్ ఫ్యామిలీగా కలిసున్నామని, ఆయన మాట ప్రకారమే నడుచుకున్నామని, వీలునామా రాయనిపక్షంలో ఏం చేయాలనేది కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకుంటామని తెలిపారు. ఇప్పుడు అందరం బాధలో ఉన్నాం.. ఇది ఆస్తిపాస్తుల గురించి ఆలోచించే సమయం కాదు అని అన్నారు. అన్ని కార్యక్రమాలు జరిపిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామన్నారు. తోడబుట్టిన వారికి ఆయన నుంచి ఏమి వచ్చినా సంతోషమే, రాకపోయినా బాధపడమని శరత్ బాబు సోదరుడు చెప్పుకొచ్చారు.
నిజానికి శరత్ బాబు వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. రమాప్రభని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన, విభేదాలతో విడాకులు తీసుకొని 14 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆ తరువాత తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా.. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అయితే అటు రమాప్రభతో కానీ, ఇటు స్నేహలతతో కానీ.. శరత్ బాబుకి సంతానం లేదు. సొంత వారసులు లేకపోకపోవడంతో తన కుటుంబ సభ్యులను చేరదీశారు. అక్క చెల్లెలు, సోదరుల పిల్లలను మంచి చెడ్డా ఆయనే చూశారు. వాళ్లు మొత్తం 25 మంది ఉండగా, వాళ్లే తన బిడ్డలని శరత్ బాబు అనేవారట. తన కుమార్తెను దత్తత తీసుకోవాలని అనుకున్నారని శరత్ బాబు సోదరి సరిత ఇటీవల అన్నారు.
యాభై ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్న శరత్ బాబు, బాగానే ఆస్తులు కూడబెట్టారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆయనకు సొంత వారసులు లేకపోవడంతో, ఆ ఆస్తి అంతా ఎవరికి చెందుతుంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంత ఆస్తిని కుటుంబ సభ్యులకు సమానంగా పంచారనే టాక్ ఉంది. శరత్ బాబు వీలునామా రాసుంటే, దాని ప్రకారమే ఆస్తి పంపకాలు జరుగుతాయని ఆయన సోదరుడు చెబుతున్నాడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని హార్సిలీ హిల్స్ ప్రాంతం చాలా చల్లగా ఉంటుందని, అక్కడ ఇల్లు కట్టుకోవాలని శరత్ బాబు భావించారట. అందుకోసం ఆయన స్థలం కూడా కొని పెట్టుకున్నారని, రీసెంట్ గా ఇల్లు కట్టడానికి రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఇల్లు పూర్తి కాకుండానే శరత్ బాబు మరణించడం బాధాకరం.
Read Also: రమాప్రభను శరత్‌బాబు పెళ్లి చేసుకోలేదా? ఆమెతో విభేదాలు ఎందుకొచ్చాయి?