Cine Workers: షూటింగ్స్ బంద్... వేతనాల పెంపునకు ఓకే బట్ కండీషన్స్ అప్లై - నో చెప్పిన ఫెడరేషన్ నేతలు
Producers Press Meet: టాలీవుడ్ ఫిలిం చాంబర్, ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. 4 కండీషన్స్‌తో వేతనాల పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పగా... ఫెడరేషన్ సభ్యులు వ్యతిరేకించారు.

Tollywood Producers About Cine Workers Wages: సినీ కార్మికులు, టాలీవుడ్ నిర్మాతల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. శనివారం పలుమార్లు ఫెడరేషన్ సభ్యులతో చర్చించిన నిర్మాతలు... కండీషన్స్ మేరకు వేతనాలు పెంచేందుకు ఓకే చెప్పారు. అయితే దీనికి వారు అంగీకరించలేదు.
3 విడతలుగా వేతనాల పెంపు
మొత్తం 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు. వారం రోజులుగా జరుగుతున్న మంతనాలు ఓ కొలిక్కి వచ్చాయని... రోజుకు రూ.2 వేల కన్నా తక్కువగా తీసుకుంటున్న వారి వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. 'ఫస్ట్ ఇయర్ 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచుతాం. రూ.1000 కంటే తక్కువ శాలరీ ఉన్న వారికి వెంటనే 20 శాతం పెంచుతాం. రెండో ఏడాది ఎలాంటి పెంపు ఉండదు.
మూడో ఏడాది మాత్రం మరో 5 శాతం పెంచుతాం. అయితే బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకు పాత వేతనాలే ఉంటాయి. మేం పెట్టిన 4 కండీషన్స్‌కు వారు ఒప్పుకొంటే వేతనాల పెంపు వెంటనే అమలవుతుంది. అర్హత కలిగిన కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలనేదే మా అభిప్రాయం. అందరూ కలిసి చర్చించుకుంటే సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. ప్రస్తుతం రోజుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ వేతనాలు తీసుకుంటున్న వారికి పెంచాలనడం సరికాదు.' అని చెప్పారు.
నో చెప్పిన ఫెడరేషన్
అయితే, కండీషన్లతో వేతనాల పెంపును తాము అంగీకరించేది లేదంటూ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా... యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా ప్రొడ్యూసర్స్ నిర్ణయాలు ఉన్నాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు గత కొద్ది రోజులుగా షూటింగ్స్ బంద్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వేతనాలు పెంపుకు సుముఖత చూపని నిర్మాతలు... టాలెంట్ ఉన్న వారిని యూనియన్‌లో సభ్యులు కాకపోయినా తీసుకుంటామని ప్రకటించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. చర్చల తర్వాత షూటింగ్స్ బంద్ చేయాలంటూ తెలుగు ఫిలిం చాంబర్ డెసిషన్ తీసుకుంది. స్టూడియోస్, ఔట్ డోర్ యూనిట్స్ పర్మిషన్ లేకుండా ఎలాంటి సేవలు అందించొద్దని ఆదేశించింది. మీటింగ్స్, ఇతర చర్చలకు ఫిలిం చాంబర్ సభ్యులు దూరంగా ఉండాలని... ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
మెగాస్టార్, బాలయ్యలతో భేటీ
మరోవైపు, ఈ సమస్య పరిష్కరించాలంటూ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలను కలిశారు. అయితే, ఇరు వర్గాలు కలిసి సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు చిరంజీవి. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు బాలకృష్ణ.





















