పొరుగింటి పుల్లకూరే రుచి - కోలీవుడ్ వైపు టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు
టాలీవుడ్ దర్శక నిర్మాతలు కోలీవుడ్ హీరోలతో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ వంటి దర్శకులు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లోని పలువురు దర్శక నిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ వంటి దర్శకులు తమిళ చిత్రాలు తెరకెక్కించగా.. మరికొందరు డైరెక్టర్లు ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు. ప్రత్యేకంగా కోలీవుడ్ హీరోల కోసమే కథలు రాసుకుంటున్నారు. మన నిర్మాతలు సైతం అక్కడి హీరోలకు తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ద్విభాషా చిత్రాలుగా మలచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతకు లాభాలనే తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు విజయ్ - వంశీ కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
అలానే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ లో ధనుష్ హీరోగా 'సార్' అనే బైలింగ్విల్ మూవీని తీశారు సూర్యదేవర నాగవంశీ. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నిజానికి 'వాతి' కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. ఎస్ఎస్ఎల్వి బ్యానర్ లో ఏసియన్ సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని బ్యాంక్ రోల్ చేశారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే దీని ముందే సునీల్ నారంగ్ తమిళంలో 'ప్రిన్స్' అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఇందులో భాగమయ్యారు. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ నిర్మాతలకు ప్రాఫిట్స్ మిగిలేలా చేసింది. ఇలా తమిళ హీరోలతో చేసిన సినిమాలు మంచి లాభాలను తెచ్చి పెడుతుండటంతో, మరికొందరు నిర్మాతలు కోలీవుడ్ వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం.. ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేయకుండా మీన మేషాలు లెక్కపెడుతుండటంతో.. తెలుగు దర్శకులు తమిళ హీరోల కోసం ట్రై చూస్తున్నారని తెలుస్తోంది. అవకాశం దొరికే రజినీ కాంత్, సూర్య, కార్తీ వంటి హీరోలకు కథలు చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే 'సర్కారు వారి పాట' దర్శకుడు పరశురామ్ పెట్లా.. కార్తీకి ఓ స్టోరీ నేరేట్ చేస్తున్నట్లు టాక్ ఉంది.
'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఉదుగుల కూడా ఓ కోలీవుడ్ మూవీ చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను కూడా ఎప్పటి నుంచో ఈ జాబితాలో ఉన్నాడు. అలానే డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను తమిళ్ లో పరిచయం చేయాలని దిల్ రాజు చూస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కొల్లు బాబీ, గోపీచంద్ మలినేని వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు ఇప్పుడు తెలుగు హీరోలు దొరికే పరిస్థితి లేదు కాబట్టి, పక్క భాష కథానాయకులను ట్రై చేయొచ్చేమో చెప్పలేం.
వాస్తవానికి మన వాళ్ళు కోలీవుడ్ వైపు చూడటం, అక్కడి హీరోలతో సినిమాలు చేయడం ఇదేమీ కొత్తకాదు. అప్పట్లో కళాతపస్వి కె విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస్ లాంటి దర్శకులు కమల్ హాసన్ తో చిత్రాలు రూపొందించారు. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా ప్రాంతీయత భేదాలు పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి, అందరూ అన్ని భాషలలోనూ సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!