Suriya: ఇంత ప్రేమ? తెలుగు ప్రేక్షకుల వీరాభిమానంపై స్పందించిన సూర్య
‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్ సెలబ్రేషన్స్‌లో ప్రేక్షకుల అభిమానానికి హీరో సూర్య ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.
సినీ ప్రేమికులకు చాలావరకు భాషతో సంబంధం ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. అది ఏ భాష అని ఆలోచించకుండా థియేటర్ల ముందు వెళ్లి నిలబడే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇక ఓటీటీ అనేది వచ్చిన తర్వాత.. సినిమా చూడడానికి భాష రాకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్.. ఏ భాష సినిమాను అయినా నచ్చితే ఎక్కువగా ఆదరిస్తారు అని ఇప్పటికే ఎంతోమంది ఇతర భాషా పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రిటీలు తెలిపారు. ఇప్పుడు అదే విషయం మరోసారి నిరూపణ అయ్యింది. ఒక తమిళ చిత్రం తెలుగులో రిలీజ్ అయినప్పుడు.. దాని కంటెంట్ బాగుంటే అది హిట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే చిత్రం రీ రిలీజ్ అయ్యి అభిమానులను అలరిస్తే ఎలా ఉంటుందో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రేక్షకుల అభిమానానికి హీరో సూర్య ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యారు కూడా.
15 ఏళ్లు అయినా తగ్గని క్రేజ్..
‘వారనం ఆయిరం’.. 2008లో విడుదలైన తమిళ చిత్రం ఇది. ఈ టైటిల్ చెప్తే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ అంటే తెలియని తెలుగు సినీ ప్రేమికులు చాలా తక్కువ మంది ఉంటారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘వారనం ఆయిరం’.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా కమర్షియల్ హిట్ అయ్యిందా లేదా అనేది చాలామందికి గుర్తులేదు. కానీ హారిస్ జయరాజ్ అందించిన పాటలు మాత్రం ఆడియన్స్ ప్లే లిస్ట్‌లో ఇప్పటికీ ప్లే అవుతూనే ఉన్నాయి. అలాంటి క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూడాలి అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికోసమే తమిళంలో కాకపోయినా తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తెలుగులో రీ రిలీజ్ అయ్యింది.
‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్‌ను జులైలోనే ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవ్వడంతో ఈ రీ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఫైనల్‌గా ఆగస్ట్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్‌కు ఏదో కొత్త సినిమా విడుదలైనట్టుగా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించింది. అంతే కాకుండా సినిమాలు వచ్చే పాటలకు థియేటర్‌లో ఉన్న ఫ్యాన్స్ అంతా గొంతుకలిపారు. ముఖ్యంగా ‘అది నన్నే చేరవచ్చే చంచలా’ సాంగ్‌కు అయితే చాలావరకు ఫ్యాన్స్.. స్క్రీన్ దగ్గరకు వెళ్లి డ్యాన్స్ చేశారు కూడా. ఈ సెలబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హీరో సూర్య వరకు చేరాయి. తన మూవీ రీ రిలీజ్‌కు తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానంపై సూర్య ట్విటర్ ద్వారా స్పందించారు.
‘చంచలా’ పాటకు ఏదీ సాటి రాదు..
‘ఈ ప్రేమ నాకొక పెద్ద సర్‌ప్రైజ్. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ టీమ్‌కు పెద్ద థ్యాంక్స్. మాటలు రావడం లేదు. మీరంతా బెస్ట్’ అంటూ థియేటర్‌లో జరుగుతున్న సెలబ్రేషన్ వీడియోను షేర్ చేశాడు సూర్య. ఇప్పుడు ఉన్న బ్రేకప్ సాంగ్స్‌తో పోలిస్తే.. ఒకప్పుడు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ నుంచి వచ్చిన చంచలా పాటే హైలెట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ పాటకు ప్రతీ థియేటర్‌లో హడావిడి మామూలుగా లేదు. రీ రిలీజ్‌కు వస్తున్న క్రేజీ రెస్పాన్స్ చూసి సినిమాను మరికొన్ని రోజులు థియేటర్‌లలోనే ఉంచాలని మూవీ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఆలియా భట్ - ఎలాగంటే..?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial