Sudheer Babu: సుధీర్ బాబు సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ - బాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో 'సూపర్ స్టార్' అల్లుడి పాన్ ఇండియా మూవీ
Sudheer Babu: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మించనున్నారు.
Sudheer Babu: సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు.. కేరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే 'నవ దళపతి'గా 'హరోం హర' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కే పాన్ ఇండియా మూవీ. హిందీలో 'రుస్తుం', 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ', 'ప్యాడ్ మ్యాన్', 'పరి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సుధీర్ బాబు సినిమా తెరకెక్కనుంది. ఇది సూపర్ నేచురల్ కథ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధ్యానత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామని మేకర్స్ చెబుతున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుందని, కచ్ఛితంగా ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు.
సుధీర్ బాబు కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభించామని మేకర్స్ భావిస్తున్నారు. 2025లో మహా శివరాత్రి సందర్భంగా మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తవ్వడంతో, ఆగస్ట్ 15న తేదీన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. దీని కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కథానాయకతో సహా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడిస్తారు.
బాలీవుడ్ మేకర్స్ తో పాన్ ఇండియా మూవీ చేయడం పట్ల హీరో సుధీర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నానని, దీని కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇది డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందనున్న సినిమా అని, వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి ప్రేరణ అరోరా అండ్ టీమ్ ఎంతగానో కష్టపడుతున్నారని తెలిపారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉందని సుధీర్ బాబు ధీమాగా ఉన్నారు.
ఇకపోతే రీసెంట్‌గా 'హరోం హర' చిత్రంతో సక్సెస్ సాధించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది సెట్స్ మీద వుండగానే ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ ఫిలిం మేకర్ ప్రేరణ అరోరా నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించారు.