Soubin Shahir Arrest: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?
Manjummel Boys Producer Controversy: హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన 2024 మలయాళ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించే సత్తా ఉందని చూపించిన మొదటి సినిమా 'మంజుమ్మేల్ బాయ్స్' (Manjummel Boys). బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. తెలుగులోనూ మలయాళ డబ్బింగ్ సినిమాల పరంగా భారీ వసూళ్లు సాధించింది. దీని రికార్డులను మోహన్ లాల్ 'లూసిఫర్ 2' బ్రేక్ చేసిందనుకోండి. ఇప్పుడు 'మంజుమ్మేల్ బాయ్స్' ప్రస్తావన ఎందుకంటే... ఆ సినిమా నిర్మాతలను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రొడ్యూసర్లను అరెస్టు చేసిన కేరళ పోలీసులు...
ముందస్తు బెయిల్ ఉండడంతో వెంటనే విడుదల!
'మంజుమ్మేల్ బాయ్స్'లో ప్రధాన పాత్ర పోషించిన సౌబిన్ షాహిర్ (Soubin Shahir) సినిమా నిర్మాతలలో ఒకరు. ఆయనతో పాటు బాబు షాహిర్, ష్వాన్ ఆంటోనీలను ఈ రోజు (మంగళవారం, జూలై 8న) కేరళలోని మారాడు పోలీసులు అరెస్టు చేశారు.
'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాకు తాను ఫైనాన్స్ చేశానని, తన దగ్గర ఏడు కోట్ల రూపాయలను తీసుకున్న నిర్మాతలు లాభాలలో 40 శాతం వాటా ఇస్తానని ప్రామిస్ చేశారని, అయితే విడుదల తర్వాత తమ మాట నిలుపుకోలేదని ఫైనాన్షియర్ సిరాజ్ వలియతుర కంప్లైంట్ చేశారు. ఆ కేసులో పోలీసులు నిర్మాతలను అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు బయలు ఉండడంతో వాళ్లను వెంటనే విడుదల చేశారు.
Also Read: శైవం, వైష్ణవం మధ్య వారధిగా వీరమల్లు... సినిమా అసలు కథ ఇదేనా?

'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతలకు బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను కొట్టి వేసింది కేరళ హైకోర్టు. అదే సమయంలో కేసును కొట్టి వేయాలని నిర్మాతలు చేసిన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. నిర్మాతలను ప్రశ్నించడానికి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. దీనిపై 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతలు ఇంకా స్పందించలేదు. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ'లో సౌబిన్ షాహిర్ నటించారు.





















