Rashmika Mandanna: సెట్‌లో అందరూ చప్పట్లు కొట్టారు, ప్రేక్షకులు మాత్రం ట్రోల్ చేశారు - ‘యానిమల్’పై రష్మిక స్పందన
Animal Movie: ‘యానిమల్’ మూవీపై ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదలయిన తర్వాత ఒక సీన్‌లో రష్మిక నటనకు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దానిపై తాజాగా రష్మిక స్పందించింది.
Rashmika Mandanna About Trolls On Animal Movie: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీతో రణబీర్ కపూర్‌కు కెరీర్‌లోనే పెద్ద హిట్ అందింది. అలాగే రష్మిక మందనాకు కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కానీ ‘యానిమల్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం రష్మిక పాత్ర అలా ఉంటుంది అని ప్రేక్షకులు ఊహించలేదు. ట్రైలర్‌లో తను చెప్పిన ఒక డైలాగ్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత అది ఎంత ముఖ్యమైన సీన్ అని అందరికీ అర్థమయ్యింది. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై రష్మిక స్పందించింది.
అలా చేయడం నచ్చదు..
తాజాగా నేహా దూపియా పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రష్మిక మందనా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘యానిమల్’ సక్సెస్, దానిపై వచ్చిన ట్రోల్స్‌పై కూడా తను స్పందించింది. ‘‘అమ్మాయిల బాడీపై కామెంట్స్ చేయడం, ట్రోల్ చేయడం నాకు అస్సలు నచ్చదు. నా విషయంలో అలా కాదు. వారు నన్ను నా సినిమాల విషయంలో ట్రోల్ చేస్తున్నారు. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఆ సీన్‌ను అయిదు నెలల క్రితం షూట్ చేశాను’’ అంటూ ‘యానిమల్’లోని కర్వా చౌత్ సీన్ గురించి చెప్పుకొచ్చింది రష్మిక. అప్పటివరకు ట్రైలర్‌ను చూసి తనను ట్రోల్ చేసిన చాలామంది ప్రేక్షకులు.. మూవీ రిలీజ్ అవ్వగానే ఆ సీన్‌కు రష్మిక ప్రాణం పోసిందని ప్రశంసించారు.
చప్పట్లు కొట్టారు..
‘‘కర్వా చౌత్ సీన్ అనేది 9 నిమిషాల నిడివి ఉన్నది. అది చేస్తున్నప్పుడు సెట్‌లో ఉన్నవారందరికీ చాలా నచ్చింది. అందరూ చప్పట్లు కొట్టి చాలా బాగా వచ్చిందన్నారు. కానీ ట్రైలర్ బయటికి వచ్చిన తర్వాత ఆ సీన్‌లోని ఒక డైలాగ్‌ను పట్టుకొని అందరూ ట్రోల్ చేశారు. నేను 9 నిమిషాల సీన్ చేశాను, సెట్‌లో అందరికీ నచ్చింది, కానీ ప్రేక్షకుల మాత్రం దీనిపై నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇదేంటి? నేనేమైనా బబుల్‌లో బ్రతుకున్నానా అనుకున్నాను. నువ్వు ఏం చేశావో నీకు తెలుసు కానీ ప్రేక్షకులకు తెలియదు కదా.. ట్రైలర్‌లో కనిపించిన 10 సెకండ్లు మాత్రమే వారికి తెలుసు. అప్పుడే నేను అసలు బబుల్‌లో బ్రతకకూడదు అనుకున్నాను. నేను నేల మీదే ఉండాలి, ప్రేక్షకులతో మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపింది రష్మిక.
గీతాంజలిగా..
‘యానిమల్’లో బల్బీర్ సింగ్ పాత్రలో నటించినందుకు రణబీర్ కపూర్‌కు ఎంత క్రేజ్ దక్కిందో.. గీతాంజలి పాత్రతో రష్మిక కూడా అంతే ప్రశంసలు అందుకుంది. సినిమాలో తన పాత్ర నిడివి కాసేపే అయినా తృప్తి దిమ్రీ కూడా ‘యానిమల్’ వల్ల పాపులర్ అయ్యింది. ఇలా అందరి పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’కు రూ.900 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. ఇక ‘యానిమల్’ తర్వాత రష్మిక.. బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయింది. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి తన చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Also Read: మోడలింగ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు - రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా?