RC16 Talent Hunt: RC16 టాలెంట్ హంట్ - రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్!
RC16 Talent Hunt: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషనన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ RC16 కోసం టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
RC16 Talent Hunt: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఔత్సాహిక నటీనటులకు ఈ సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని అందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు.
RC 16 మూవీ కోసం ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో విజయనగరం సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగబోతున్నట్లు తెలిపారు. ఔత్సాహిక నటీనటులందరూ ఈ సెన్సేషనల్ మూవీలో భాగం కావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏరియాల వారీగా ఆడిషన్స్ జరిగే తేదీలు, వేదికలు, టైమింగ్స్, సంప్రదించవలసిన వ్యక్తుల వివరాలను తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు RC16 కోసం యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇది కోస్టల్ ప్రాంతంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా అని, ఇందులో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో జరిగే స్టోరీ కనుక ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా డైలాగ్స్ చెప్పగల నటీనటులు అవసరం అవుతుంది. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఆడిషన్స్ లో దాదాపు 400 మంది నటీనటులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: తెలుగు మూవీస్ ఓవర్సీస్ రైట్స్ - ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయంటే?
RC16 సినిమాతో వెంకట సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొంతమంది టాప్ టెక్నిషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
RRR తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్, 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మార్చి రెండవ వారంలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళి, మార్చి 27న చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రం నుంచి కూడా ఏదైనా స్పెషల్ అప్డేట్ ఉంటుందని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు ట్రెక్కింగ్ - ఈ భయానక అడవి ప్రత్యేకతలు ఇవే!