Vettaiyan Ticket Price: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, తెలంగాణలో తగ్గిన 'వేట్టయన్' టికెట్ రేట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?
Rajinikanth Vettaiyan Movie | తెలంగాణలో రజినీకాంత్ హీరోగా నటించిన 'వేట్టయన్' సినిమా టికెట్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. మరి ఈ తగ్గిన టికెట్ రేట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో తెలుసుకుందాం పదండి.
Rajinikanth Vettaiyan Telugu Movie | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లపై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు టికెట్లు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేయడానికి ఆలోచిస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా 'వేట్టయన్'కు మాత్రం టికెట్ రేట్లు తగ్గడం విశేషం.
తగ్గిన 'వేట్టయాన్' టికెట్ రేట్లు...
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ 'వేట్టయన్ : ది హంటర్'. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ మూవీని బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. దసరా కానుకగా 'వేట్టయన్' సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాగా, పాజిటివ్ రెస్పాన్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ హీరోయిన్ మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. తాజాగా ఈ మూవీ టికెట్ రేట్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేశారు. తెలంగాణలో దసరా సెలవులు ముగియడంతో టికెట్ రేటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తగ్గించారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్ ధర రూ.200 కాగా, సిటీ సింగిల్ స్క్రీన్ లలో రూ.150కి తగ్గించారు. అలాగే డిస్ట్రిక్ట్ సింగిల్ స్క్రీన్ లలో రూ.110 టికెట్ రేట్ ఉండబోతోంది. ఈ తగ్గిన టికెట్ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం
అయితే దాదాపు ఇప్పటికే 'వేట్టయన్' సినిమా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గబోతున్న నేపథ్యంలో తెలంగాణలో 'వేట్టయాన్'కు మరింతగా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. టికెట్ రేట్లు దిగి రావడంతో 'వేట్టయన్' మూవీ ఆక్యుపెన్సీ పెరగడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ మూవీ ఎన్కౌంటర్ హత్య, అవినీతి, విద్యా వ్యవస్థ, న్యాయం, అధికారం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు.
Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
టికెట్ రేట్లపై చర్చ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల గురించి మాట్లాడిన విధానం కొత్త చర్చకు దారి తీసింది. రూ. 1500లకు మూడు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారు? ఇంత ఖర్చు పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాను చూడలేరా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు టికెట్ రేట్లపై ఆలోచించుకుంటే మంచిది అంటూ ఈ విషయంపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.