Raajadhani Files Trailer : ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించేలా 'రాజధాని ఫైల్స్' - ట్రైలర్ చూశారా?
Raajadhani Files Trailer : ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని ప్రధానంగా తీసుకొని తెరకెక్కించిన 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
Raajadhani Files Trailer, A Political Drama Around Amaravati : ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ పార్టీలకు మద్దతుగా కొన్ని సినిమాలు తెరకెక్కుతుంటే, వ్యతిరేకంగా మరికొన్ని సినిమాలు సరిగ్గా ఎలక్షన్ టైం లోనే రాబోతున్నాయి. కచ్చితంగా ఈ సినిమాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ రాజకీయాలపై ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం', 'శపథం' పేరుతో సినిమాలు తీశాడు, వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'యాత్ర 2' మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పై మరో సినిమాలో 'రాజధాని ఫైల్స్' రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. రాజధానుల కోసం రైతుల భూములను సేకరించడం, మూడు రాజధానుల ప్రకటన తర్వాత రైతులు పోరాడడం.. లాంటి సంఘటనలు ఏపీ రాజకీయాల్లో ఎంతటి సంచలనమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ అంశాలను ప్రధానంగా తీసుకొని 'రాజధాని ఫైల్స్' అనే సినిమాని తెరకెక్కించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధాని ప్రాంతంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిశంకర్ నిర్మాత. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు.
ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో మూడు రాజధానుల విషయంలో జరిగిన గొడవలను చూపించారు. అయితే ఇక్కడ అమరావతి పేరుని అయిరావతిగా, ఆంధ్రప్రదేశ్ పేరుని అరుణప్రదేశ్ గా మార్పు చేసి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు చిత్ర యూనిట్.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించారు. వైసీపీ అధికారిక భాష నుంచి గుడివాడ క్యాసినో వరకు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను ట్రైలర్ లో చూపించారు. 'కష్టపడమని చెప్తే.. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి', 'ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి’ అంటూ ప్రజల గురించి ఎంతో నీచంగా ఆలోచించే ముఖ్యమంత్రి, '140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా, 'ఏడాది కాకపోతే.. నాలుగేళ్ళకైనా చదును చేస్తాం.. పంటలు పండిస్తాం.. రైతులారా..', 'మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర' అంటూ ఆ ముఖ్యమంత్రిని ఎదిరించాలని, ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పి తమ హక్కుల్ని కాపాడుకోవాలని పోరాటం చేసే ప్రజలు.. ఇలా ఎన్నో అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించి సినిమాపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : క్లీంకార కేర్ టేకర్ ఎవరో తెలుసా? - ఆమె నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే