NBK 111: బాలకృష్ణ సినిమాలో నయన్ ఫిక్స్... కథ మారింది కానీ హీరోయిన్ కాదు!
Balakrishna Nayanthara New Movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకొన్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిసింది.

'అఖండ 2 తాండవం'తో గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజతో ఆ సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాపై కొత్త పుకారు షికారు చేయడం మొదలైంది. ఈ సినిమా నుంచి లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) తప్పుకొన్నారని. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిసింది.
కథ మారింది కానీ హీరోయిన్ కాదు!
బాలకృష్ణ, నయనతారలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. బాపు దర్శకత్వం వహించిన 'శ్రీరామరాజ్యం'లో తొలిసారి వాళ్ళిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత 'సింహా' చేశారు. అదీ బ్లాక్ బస్టర్. దాని తర్వాత 'జై సింహ'తో హ్యాట్రిక్ హిట్ నమోదు చేశారు. గోపీచంద్ మలినేని సినిమాతో ఈ జంట డబుల్ హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుట్టింది. కొన్ని రోజుల క్రితం పూజతో సినిమా స్టార్ట్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి నయనతార తప్పుకొన్నారని ప్రచారం మొదలైంది.
ప్రజెంట్ మార్కెట్, ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని కథ మార్చరట. తొలుత చారిత్రక నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా తీయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు కథలో కొన్ని మార్పులు జరుగుతున్నాయట. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తారా? లేదంటే మారుస్తారా? అనేది చూడాలి.
గోపీచంద్ మలినేని మొదట అనుకున్న కథలో బాలకృష్ణది డ్యూయల్ రోల్. ఆ రెండిటిలో ఒకటి మహారాజు క్యారెక్టర్. ఆ చక్రవర్తికి జంటగా మహారాణి పాత్రలో నయనతార నటించాలి. ఇప్పుడు ఆ పాత్రలు ఉంటాయా? లేదా? అనేది చూడాలి. 'వీర సింహా రెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. ఇది బాలకృష్ణ 111వ సినిమా (NBK 111 Movie). మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'తో సంక్రాంతికి నయన్ థియేటర్లలోకి రానున్నారు. ఆ తర్వాత ఆవిడ చేస్తున్న తెలుగు సినిమా బాలయ్యది.





















