Anushka48: స్వీటి శెట్టి కోసం క్రేజీ అప్డేట్‌తో వచ్చిన నవీన్ పోలిశెట్టి, ఇదిగో వీడియో
అనుష్క శెట్టి - నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని రేపు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి.. 'జాతిరత్నాలు' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గత రెండేళ్లుగా ప్రేక్షకులను పలకరించని టాలెంటెడ్ యాక్టర్.. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒక సినిమాలో అగ్ర కథానాయిక అనుష్క శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
అనుష్క - నవీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తాత్కాలికంగా #Anushka48, #NaveenPolishetty3 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుస్తున్నారు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్న చిత్ర బృందం.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎక్కువ సమాచారం వెల్లడించలేదు. అయితే ఇప్పుడు టైటిల్ ను అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యారు.
తాజాగా హీరో నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో ఫన్నీ ఇన్స్టా రీల్ ద్వారా టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్ అందించారు. నవీన్ మాట్లాడుతూ.. ‘‘హాయ్ అనుష్క, మన సినిమా ఎక్స్ లెంట్ వస్తోంది కదా.. టైటిల్ పెట్టే టైం వచ్చింది. కొన్ని నమ్మశక్యం కాని టైటిల్ ఆప్షన్స్ వచ్చాయి. 'దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా!' 'స్వీటీతో ఎవడీ క్యూటీ' టైటిల్స్ ఎలా ఉన్నాయి?’’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో రేపు మార్చి 1న Anushka48 టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు నవీన్ తెలిపారు. రేపటి క్రేజీ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అని మేకర్స్ పేర్కొన్నారు. నిజానికి ఈ చిత్రానికి అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి పేర్లు కలిసొచ్చేలా ''మిస్ శెట్టి & మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ను ఖరారు చేశారో లేదో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
View this post on Instagram
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా 'అన్విత రవళి శెట్టి' అనే చెఫ్ పాత్రలో అనుష్క కనిపించనుంది. ఇప్పటికే ఆమె పుట్టినరోజు స్పెషల్ గా రిలీజ్ చేయబడిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య కాస్త ఒళ్ళు చేసి బొద్దుగా మారిన స్వీటీ.. చాలా స్లిమ్ గా మారిపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. అందులోనూ స్వీటీ చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఏర్పరచుకున్న అనుష్క.. ఇటీవల కాలంలో సినిమాలు బాగా తగ్గించేసింది. చివరగా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఇన్నాళ్లకు తన 48వ సినిమాతో వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 14గా ఈ చిత్రం రూపొందుతోంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.