Nani: మీ ప్రతి సినిమాలో లిప్‌లాక్స్ తప్పనిసరా? మీడియా ప్రశ్నకు నానీ సమాధానం ఇదే!
నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని.. పక్కింటి అబ్బాయి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అలాంటి హీరోకు లిప్ లాక్స్ గురించి ప్రశ్న ఎదురయ్యింది.
నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సినిమాలు కమర్షియల్‌గా ఎంటర్‌టైన్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో సంపాదించుకున్నారు నాని. ఇక త్వరలోనే ‘హాయ్ నాన్న’ అనే మరో ఫ్యామిలీ డ్రామాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది. టీజర్ లాంచ్ వేడుకలో నానితో పాటు ఇతర మూవీ టీమ్ కూడా పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ‘హాయ్ నాన్న’ విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో ప్రతీ సినిమాలో లిప్ లాక్ చేయడం గురించి నానికి ప్రశ్న ఎదురవ్వగా దానికి సింపుల్‌గా సమాధానమిచ్చారు నాని.
‘హాయ్ నాన్న’తో కల నెరవేరింది..
పెళ్లికాకముందు నుండే తనకు ఒక ఆడపిల్ల తండ్రి కావాలని కల అని నాని బయటపెట్టారు. అయితే ‘హాయ్ నాన్న’ సినిమా ద్వారా తనకు ఆ కలలో జీవించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. స్క్రిప్ట్ చాలా బాగుందని, అందరూ కనెక్ట్ అవుతారని, తన కెరీర్‌లో ఇదొక స్పెషల్ సినిమా అని నాని చెప్పుకొచ్చారు. అయితే నాని సినిమాలు ప్రేక్షకుల్లో ఆదరణ సంపాదించుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో అప్పుడప్పుడు కాస్త వెనకబడుతూ ఉంటాయి. ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలను ఉదాహరణగా చూపించి నిర్మాతలకు అనుకున్నంత డబ్బులు రాలేదని టాక్ అని నానిని ప్రశ్నించగా.. దానికి హీరో ముక్కుసూటిగా సమాధానమిచ్చారు.
‘జెర్సీ’ ఉదాహరణగా చెప్పడం తప్పు..
‘‘ఈ మాట ఏ నిర్మాతలు చెప్పారో చెప్పండి. నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి. గత సినిమాల కలెక్షన్స్ గురించి ఈ వేదికపై మాట్లాడడం కరెక్ట్ కాదు. అన్ని విధాలుగా ఆ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ‘జెర్సీ’ ఉదాహరణగా చూపించడం తప్పు. కావాలంటే ‘అంటే సుందరానికీ’ ఉదాహరణగా చెప్పొచ్చు. తెలిసి తెలియని వాళ్లు ఇలాటి మాటలు మాట్లాడొచ్చు కానీ అన్నీ తెలిసిన మీడియా అలా చేయకూడదు.’’ అని నాని కాస్త అసహనం వ్యక్తం చేశారు. ‘దసరా’ రిజల్ట్ గురించి మాట్లాడినప్పుడు హిందీలో ‘దసరా’కు మంచి ఆదరణ లభించిందని, అది తనకు సంతోషాన్ని ఇచ్చింది అన్నారు నాని. ఇక ‘జెర్సీ’ తన కెరీర్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా అని నిర్మాత నాగవంశీ సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ప్రతీ సినిమాలో లిప్ లాక్స్..?
‘హాయ్ నాన్న’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే ‘సైంధవ్’లాగా ఉందని ఒకరు ప్రశ్నించారు. అయితే దానికి, దీనికి చాలా తేడా ఉందని నాని హామీ ఇచ్చారు. మీరు నటించిన ప్రతీ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ‘హాయ్ నాన్న’ టీజర్‌లోని లిప్ లాక్స్‌ను ఉద్దేశించి నానిని ప్రశ్నించారు. అయితే ‘‘ప్రతీ సినిమాలో ఏమీ లేవు. నా ముందు సినిమా దసరా, అంతకు ముందు అంటే సుందరానికీ.. ఈ రెండు సినిమాల్లో లేవు. కాబట్టి ప్రతీ సినిమాలో ఉంటాయి అనడంలో లాజిక్ లేదు. కేవలం టీజర్ కోసం లిప్ లాక్స్ అనేవి చేయను. సీన్‌కు అవసరమయితేనే చేస్తాను.’’ అని నాని ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. ఇక ‘సలార్’ వల్ల ‘హాయ్ నాన్న’ రిలీజ్ డేట్‌ను ప్రీపోన్ చేసి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ‘హాయ్ నాన్న’ కోసం మృణాల్‌తో తొలిసారి జతకట్టారు నాని. శౌర్యువ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Also Read: బర్త్‌డే రోజు.. సాయి ధరమ్ తేజ్ అలాంటి నిర్ణయం - మీరు కూడా సెల్యూట్ చేస్తారు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial