Thandel Song: ‘తండేల్’ శివశక్తి సాంగ్ వచ్చేసింది... నాగ చైతన్య, సాయి పల్లవి తాండవమాడేశారు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవంతే
Thandel Song: గత కొన్ని రోజులుగా ఊరిస్తూ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసిన ‘తండేల్’ మూవీ ‘నమో నమ: శివాయ’ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. చైతూ, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ పాట ఎలా ఉందంటే
Namo Namah Shivaya Lyrical Song: అవును నాగ చైతన్య, సాయి పల్లవి తాండవమాడేశారు. వారిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘తండేల్’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరి’ సినిమాలో ఈ జంట కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదీ కూడా నేషనల్ అవార్డు పొందిన ‘కార్తికేయ 2’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తండేల్’ చిత్రం కావడంతో.. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ‘తండేల్’ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి వదులుతున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్రేజ్‌ని డబుల్ చేస్తోంది. ఆ క్రేజ్‌ను ఎక్కడా తగ్గనీయకుండా.. చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్‌ని మేకర్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘నమో నమ: శివాయ’ను మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా వచ్చిన ‘నమో నమ: శివాయ’ పాట, అందులో నాగ చైతన్య, సాయి పల్లవిల వీరోచిత డ్యాన్స్.. వినగానే డివోషనల్ మూడ్‌లోకి తీసుకెళుతోంది. ‘కార్తికేయ 2’ సినిమాతో చందూ మొండేటి సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ సినిమా వైబ్స్‌ని కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉందీ పాట. మరీ ముఖ్యంగా శివ భక్తులకు, ఆరాధకులకు మరో మంచి పాట సెట్టయిందనే చెప్పుకోవచ్చు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా హైలెట్ అనేలా ఉంది. పాట సాహిత్యం విషయానికి వస్తే..
‘‘నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
హే ఢమ ఢమ ఢమ అదరగొట్టు.. ఢమరుకాన్ని దంచికొట్టు
అష్టదిక్కులదిరెటట్టు.. తాండవేశ్వరా..
నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
భమ్ భమ్ భమ్ మొదలుపెట్టు.. అమృతాన్ని పంచిపెట్టు
గుండె వెండికొండయ్యెట్టు.. కుందలేశ్వరా..
నమో నమ:, నమో నమ:, నమో నమ: శివాయ..
జై శంకరా.. జైజై శంకరా..
నిప్పు కన్ను విప్పి.. జనం తప్పును కాల్చేయరా..
జై శంకరా.. శివ శివ శివ శంకరా..
త్రిశూలం తిప్పి సూపి మంచి దారి నడపరా.. ’’ అంటూ సాగిన ఈ పాటకు జొన్నవిత్తుల అందించిన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు.. ఈ పాటని ప్రతి శివుని గుడిలోకి చేర్చేలా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఈ పాటని దైవత్వం నిండిన కంఠాలతో ఆలపించగా.. శేఖర్ మాస్టర్.. ఆ అర్ధనారీశ్వరులే వచ్చి ఆడుతున్నారా? అనేలా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో ఈ పాటని కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
వాస్తవానికి ఈ పాట డిసెంబర్ 22వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అరవింద్ అండ్ టీమ్ డిస్టర్బ్ అవడంతో వాయిదా వేసి జనవరి 4న విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.