ఆ ఘటనలను మొత్తం కేరళాకే ఆపాదిస్తారా? ‘ది కేరళ స్టోరీ’పై విరుచుకుపడ్డ టొవినో థామస్
'2018'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టోవినో థామస్ ఇటీవల రిలీజైన 'ది కేరళ స్టోరీ'పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 35మిలియన్ల మందిని కేవలం 3 సంఘటనలతో జనరలైజ్ చేయలేమని, ఆ సిినిమాకు ఆ పేరు పెట్టడం తప్పన్నారు.
Tovino Thomas : ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' అనేక వివాదాలకు కారణమైంది. మే 5న రిలీజైన ఈ చిత్రానికి ముందు నుంచీ అవాంతరాలు ఎదురవుతునే ఉన్నాయి. సినిమా టీజర్ విడుదల నుంచి మూవీ రిలీజ్ వరకు ఏదో ఒక అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొంటూ వచ్చింది. ఈ మూవీని విడుదల చేయొద్దని పలు రాష్ట్రాల్లో నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు టోవినో థామస్ ఈ మూవీపై స్పందించారు. ఈ సినిమాలో 32వేల మంది నుంచి ముగ్గురికి మార్చారని.. కేవలం ఈ మూడు సంఘటనల ఆధారంగా దేన్నీ జనరలైజ్ చేయలేమని చెప్పారు.
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటుడు టోవినో థామస్. కేరళలో జన్మించిన ఆయన.. సజీవన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'ప్రభువింటే మక్కల్' (2012) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ABCD' (2013), '7వ రోజు' (2014), 'ఎన్నూ నింటె మొయిదీన్' (2015), 'చార్లీ' (2015) లాంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పిచారు. 'గప్పీ' (2016) చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన టొనినో... విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఒరు 'మెక్సికన్ అపరత' (2017), 'గోధ' (2017) లాంటి మాలీవుడ్ సినిమాల్లో నటించి భారీ విజయాలు సాధించారు.
టోవినో థామస్ తాజాగా '2018' చిత్రంలో నటించారు. ఈ సినిమాకు ఈ చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ రచన, దర్శకత్వం వహించారు. కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుకు పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమానే 'ది రియల్ కేరళ స్టోరీ' అని పిలుస్తుండడం మరో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నటుడు టోవినో థామస్.. రీసెంట్ గా పలు వివాదాల నడుమ రిలీజైన 'కేరళ స్టోరీ' సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"నేను ఇంకా ఆ సినిమా (ది కేరళ స్టోరీ) చూడలేదు. సినిమా చూసిన ఎవరితోనూ మాట్లాడలేదు. ట్రైలర్ చూశాను. అందులో ‘‘32000 మంది మహిళలు...’’ అని చెప్పారు. ఆపై వారే (నిర్మాతలు) దానిని 32000 నుంచి 3కి మార్చారు. దాని అర్థం ఏంటి? నాకు తెలిసినంత వరకు కేరళలో 35 మిలియన్ల మంది ఉన్నారు. కేవలం ఈ మూడు సంఘటనలతో ఎవరూ దానిని జనరలైజ్ చేయలేరు. ఇది కేరళలో జరిగిందన్న వాస్తవాన్ని నేను కాదనను. ఇది జరిగి ఉండవచ్చు. నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ దీని గురించి నేను వార్తల్లో చదివాను. ఈరోజు మనం చూసేవి వాస్తవాలు కాదు, అభిప్రాయాలు మాత్రమే. ఐదు వేర్వేరు ఛానెల్‌లలో ఒకే వార్తను ఐదు వేర్వేరు వెర్షన్‌లలో చూస్తాము. కాబట్టి, ఏది ఒప్పో, ఏది తప్పు అని నాకు తెలియదు. కానీ నేను ఈ అభిప్రాయాలను విన్నాను. కాబట్టి, ఈ వాస్తవాన్ని నేను తిరస్కరించను. కానీ 35 మిలియన్ల మందిని కేవలం మూడు సంఘటనలతోనే ఎలా జనరలైజ్ చేస్తాం. తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా చెడ్డ పని" అంటూ టోవినో థామస్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
32 వేలు అనే ఫిగర్‌ని ఎందుకు ఉపయోగించారని టోవినో థామస్ కేరళ స్టోరీ నిర్మాతలను ప్రశ్నించారు. “32వేలను మార్చి దాన్ని 3గా చేశారు. అయితే వారు మొదట 32000 అని ఎందుకు పేర్కొన్నారు? 32000 ఫేక్ ఫిగర్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు అది మూడుకి మార్చబడింది. అంటే ఏమిటి? నేను ఇక్కడ ఏమీ చెప్పదలచుకోలేదు కానీ ప్రజలే అర్థం చేసుకుంటారు. ప్రజలు గుడ్డిగా నమ్మడం మానేయాలని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మనందరం మనుషులం. మనందరికీ ఒకే రకమైన మెదడు, సామర్థ్యం ఉంది. కాబట్టి ఏదైనా గుడ్డిగా నమ్మడం మానేయండి. నేను ఏదైనా చెప్పినా గుడ్డిగా నమ్మకండా ఆలోచించండి. మీకు మెదడు ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది 2023, మనం గుడ్డిగా నమ్మడం మానేసి, ఆలోచించడం ప్రారంభించాలి. మీకు తప్పుడు సమాచారం అందించడానికి ఎవరినీ అవకాశం ఇవ్వొద్దు” అంటూ టోవినో ఘాటుగా స్పందించారు.
సినిమాల్లో కల్పిత కథలను చూపించవచ్చని, అయితే సినిమాకు 'కేరళ స్టోరీ' అని పేరు పెట్టడం తప్పేనని టోవినో అన్నారు. టోవినో థామస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాదు.. సినీ ఇండస్ట్రీలనూ హాట్ టాపిక్ గా మారాయి. టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు మలయాళం డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు టోవినో. అతడు నటించిన ‘మిన్నల్ మురళి’ మూవీ మరింత మంది అభిమానం చూరగొంది.
Also Read : 'విరూపాక్ష' విజయంతో సత్యం రాజేష్ రెండో 'పొలిమేర'కు పెరిగిన క్రేజ్!