(Source: ECI/ABP News/ABP Majha)
Laxman Meesala: అల్లు అర్జున్ ఇంటి కన్‌స్ట్రక్షన్‌లో పనిచేశాను, పెద్ద దెబ్బలే తగిలాయి - ‘మంగళవారం’ నటుడు లక్ష్మణ్ మీసాల
Mangalavaaram Actor : ‘మంగళవారం’ చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మణ్ మీసాల. సినిమాల్లోకి రాకముందు తాను ఏం చేసేవాడని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
Mangalavaaram Movie : మీరు ‘మంగళవారం’ మూవీ చూశారా? అందులో అంథుడి పాత్రలో ఆకట్టుకున్న ఆ నటుడి పేరు లక్ష్మణ్ మీసాల. సుమారు పదేళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, ‘మంగళవారం’ మూవీతో మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
ఎన్నో ఏళ్లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నా కూడా కొందరు నటీనటులకు తగిన గుర్తింపు లభించింది. అలాంటి వారికి ఒక్క సరైన సినిమా పడితే.. వారి డిమాండ్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్‌లో లక్ష్మణ్ మీసాల కూడా ఒకరు. 2012లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తాను ఎన్నో ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చానని, వచ్చిన తర్వాత బ్రతకడం కోసం అనేక పనులు చేశానని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు లక్ష్మణ్. అంతే కాకుండా అసలు తన జీవితంలో చాలావరకు విషయాలు క్లారిటీ లేకుండానే జరిగిపోయాయని అన్నాడు.
10వ తరగతి అయిపోగానే..
‘కో అంటే కోటీ’ మూవీతో మొదటిసారి స్క్రీన్‌పై కనిపించాడు లక్ష్మణ్ మీసాల. తను శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అందులో పాత్ర కోసం తెలంగాణలో మాట్లాడడానికి చాలా కష్టపడ్డానని గుర్తుచేసుకున్నాడు లక్ష్మణ్. చాలామంది తన శ్రీకాకుళం మాండలికాన్ని కంట్రోల్ చేయమని అన్నారని, కానీ అది జీవభాష దానిని మనం ఆపలేమని అన్నాడు. శ్రీకాకుళంలో విభజణలో ఉండిపోయిన రాయంపేట తన సొంతూరు అని చెప్పుకొచ్చాడు. 10వ తరగతి తర్వాత క్లారిటీ లేకపోయినా.. హైదరాబాద్ వచ్చేసిన విషయాన్ని బయటపెట్టాడు. అలా ఎందుకు అని ప్రశ్నించగా.. క్లారిటీ లేదని సమాధానమిచ్చాడు. చెప్తే పిచ్చిలాగా ఉన్నా.. క్లారిటీ లేనిదే జీవితం కదా అని అన్నాడు.
ఆశ్రయం కోసం తిప్పలు..
‘‘ఒక్కొక్క పనిచేసుకుంటూ దాని మీద విరక్తి రాగానే వదిలేసేవాడిని. విరక్తి అని కాకపోయినా.. ఎక్కడా తృప్తి అనిపించలేదు. ఎక్కడా స్వేచ్ఛ దొరకకపోవడం. అసంతృప్తి ఉండేది. సినిమా అనేది తెర మీద కనిపించే పని. అలా కనిపించాలి, బాగా చేయాలి అని మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా బ్రతికేయొచ్చు అనిపించింది. ఎవ్వరికీ అడ్డంపడకుండా, చిరాకు పడకుండా ఉండొచ్చు’’ అని సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు లక్ష్మణ్. ఫ్రెండ్స్‌తో సావాసం వల్ల చివరికి ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వచ్చిందని బయటపెట్టాడు. అందుకే వారి నుంచి దూరమయ్యి.. ఒక్కొక్క పనిచేసుకుంటూ జీవించేవాడని అన్నాడు. అదే సమయంలో పలు ఆడిషన్స్‌కు కూడా వెళ్లేవాడని తెలిపాడు. సినిమా కోసం వచ్చి కొన్నాళ్లు నాటకం అనే మత్తులో ఉండిపోయానన్నాడు.
పెద్ద దెబ్బలే తగిలాయి
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రకరకాల పనులు చేసుకుంటున్న సమయంలో కన్‌స్ట్రక్షన్ పనులు కూడా చేశానని, అల్లు అర్జున్ ఇల్లు కడుతున్నప్పుడు కూడా అక్కడ పనిచేశానని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. ‘‘ముందు తెలియదు. వెళ్లాక తెలిసింది. ఆ విషయం ఎక్కడా బయటపడలేదు. ఈమధ్య ఒక ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు పొరపాటున అన్నీ చెప్పేశాను. ఆ తర్వాత ఎంత పనయిపోయిందే అనుకున్నాను. ఆ పనుల్లో అప్పుడప్పుడు పెద్ద దెబ్బలు కూడా తగులుతూ ఉండేవి. ఎఫ్ఎన్సీసీ బిల్డింగ్ కట్టడంలో కూడా పనిచేశాను. ఎస్వీ కృష్ణా రెడ్డి ఇంటిపనికి కూడా వెళ్లాను. ఎవరెవరిదో తెలియకుండానే వెళ్లాను’’ అని తెలిపాడు లక్ష్మణ్. ఆ తర్వాత తనను మళ్లీ చదువుకొని ఎవ్వరూ చెప్పినా తాను వినలేదని అన్నాడు.
Also Read: దిల్ రాజు బ్యానర్‌లో ‘బేబీ‘ బ్యూటీకి ఛాన్స్, ఆశిష్ తో వైష్ణవి చైతన్య రొమాన్స్!