Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగరేణి ప్రాంత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగరేణి ప్రాంత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో హీరో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ లో అలనాటి అందాల తార సిల్క్ స్మిత ఫోటో కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా ఓ పాటలోనూ సిల్క్ స్మిత ఫోటోలు కనిపిస్తాయి. దీంతో ఆమెకు ఈ సినిమాకు ఉన్న సంబంధం ఏంటా అని ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్.
అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిపై క్లారిటీ ఇచ్చారు. తన చిన్నతనంలో వాళ్ల తాతయ్యకు ఓసారి కాలికి దెబ్బ తగిలినపుడు ఆయన కొంత కాలం ఇంట్లోనే ఉన్నారని, అప్పుడు ఏదైనా కావాలి అంటే తననే బయటకు పంపించేవారని చెప్పారు శ్రీకాంత్. అలా తాను కల్లు దుకాణం వద్దకు వెళ్లి తన తాత కోసం కల్లు తెచ్చేవాడినని అన్నారు. అప్పుడే మొదటి సారి కల్లు దుకాణం వద్ద సిల్క్ స్మిత ఫోటో చూశానని అన్నారు. అప్పటినుంచి తన ఫోటో అలా మైండ్ లో ఉండిపోయిందని చెప్పారు. తర్వాత ఆమె నటించిన సినిమాలు, సినిమాల పట్ల ఆమెకు ఉన్నపాషన్ చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. ఆ టైమ్ లో అలా ఉండటానికి చాలా ఘట్స్ ఉండాలని అనిపించిందని చెప్పారు. అప్పటి నుంచి ఆమెపై అభిమానం అలా పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఆమెపై ఉన్న అభిమానాన్ని ఇలా ఈ సినిమా ద్వారా చాటుకున్నానని తెలిపారు శ్రీకాంత్. అందుకే ఈ సినిమాలో చాలా చోట్ల సిల్క్ స్మిత ఫోటోలు కనిపిస్తాయని తెలిపారు.
శ్రీకాంత్ వ్యాఖ్యలతో సినిమాలో సిల్క్ స్మిత పాత్రపై క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులూ సినిమాలో హీరో.. సిల్క్ స్మిత ఫ్యాన్ అని, అందుకే అలా పెట్టారని అనుకున్నారంతా. కానీ ఆమె వీరాభిమాని హీరో కాదని దర్శకుడే సిల్క్ స్మితకు వీరాభిమాని అని తెలిసిపోయింది. ఒక హీరోయిన్ మీద ఉన్న తన అభిమానాన్ని ఇలా చాటుకోవడం పట్ల శ్రీకాంత్ ఓదెలను ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. దర్శకుడిగా ఇదే ఆయన మొదటి సినిమా. మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు శ్రీకాంత్. మరి సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. ఈ సినిమాను ఏఏ సినిమాస్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో మార్చి 30 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!