Kill Movie: రైల్లో రక్తపాతం - ఇండియాలోనే అత్యంత హింసాత్మక చిత్రం, హాలీవుడ్ రీమేక్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ స్టోరీ ఇదే
Kill Movie Review: మామూలుగా సినిమాల్లో ఫైట్ సీన్స్, అందులో వైలెన్స్ చూస్తేనే కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు కచ్చితంగా ‘కిల్’కు దూరంగా ఉండాల్సిందే.
Kill Movie Review In Telugu: మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో చూపించినంత రక్తపాతాన్ని, వైలెన్స్‌ను ఇండియన్ సినిమాల్లో చూపించడానికి ఇష్టపడరు మేకర్స్. ఇక్కడ ప్రేక్షకులు ఇబ్బందిపడే సన్నివేశాలు ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాల్లో కూడా వైలెన్స్ పెరిగిపోయింది. అలాంటి చిత్రాల్లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోనుంది ‘కిల్’ (Kill). తాజాగా విడుదలయిన ఈ సినిమా.. బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాల్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందే ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయిన కిల్.. థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కథ..
‘కిల్’ కథ విషయానికొస్తే.. అమృత్ (లక్ష్య) ఒక ఆర్మీ కమాండర్. తను కొన్నాళ్లుగా తులిక (తాన్యా మనిక్తలా)ను ప్రేమిస్తూ ఉంటాడు. వీరి రిలేషన్ గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక తులిక.. వేరే అబ్బాయిని ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన అమృత్.. వెంటనే తులిక ఇంటికి వస్తాడు. మరుసటి రోజు తను కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్తున్నానని చెప్తుంది. దీంతో అమృత్ కూడా తన ఫ్రెండ్ వీరేష్ (అభిషేక్ చౌహాన్)తో కలిసి అదే ట్రైన్ ఎక్కుతాడు. అదే ట్రైన్‌లో తులికను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు అమృత్. తులిక కూడా ఒప్పుకుంటుంది. కానీ అదే ట్రైన్‌లో వారి జీవితాలు మరో మలుపు తిరుగుతాయి.
తండ్రీ, కొడుకులు అయిన బెనీ (ఆశిష్ విద్యార్థి), ఫణి (రాఘవ్ జుయల్).. తమ గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలు చేస్తూ బ్రతుకుతారు. ముందుగా అందులో ఫణి చూపు తులికపై పడుతుంది. తులికతో ఫణి అసభ్యకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే తన తండ్రి భల్దేవ్ సింగ్ (హర్ష ఛాయ) అడ్డుపడతాడు. అదే సమయంలో వారు డబ్బున్నవాళ్లని ఫణికి అర్థమవుతుంది. అందుకే వారిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. మిగతా ప్యాసెంజర్స్ తనకు భయపడడం కోసం భల్దేవ్ బాడీగార్డ్‌ను చంపేస్తాడు. ఈ విషయం అమృత్, వీరేష్‌కు తెలిసి వారిని కాపాడడానికి వస్తారు. తులికా చెల్లెలు ఆహ్నా (అద్రిజా సిన్హా).. వేరే కంపార్ట్‌మెంట్‌లో ఉండడం వల్ల తను భల్దేవ్ కూతురు అని ఫణి గ్యాంగ్‌కు తెలియదు. దీంతో ముందుగా ఆహ్నాను కాపాడమని అమృత్‌ను కోరుతుంది తులిక.
దొంగతనానికి వచ్చిన ఫణి గ్యాంగ్‌కు అమృత్, వీరేష్ టార్గెట్ అవుతారు. కానీ అమృత్, వీరేష్ మాత్రం ఆ దొంగలను చంపకుండా కేవలం కొట్టి భయపెడితే చాలు అనుకుంటారు. అదే క్రమంలో అమృత్ కళ్ల ముందే తులికను చంపేస్తాడు ఫణి. అది చూసిన ఫణి కోపం కంట్రోల్ అవ్వదు. ఒక్కొక్కరిగా ఫణి గ్యాంగ్‌లో ఉన్న అందరినీ దారుణంగా చంపడం మొదలుపెడతాడు. అప్పుడే బెనీ రంగంలోకి దిగుతాడు. భల్దేవ్, అమృత్, వీరేష్‌లలో ఒక్కడిని కూడా వదలకూడదని ఫణికి చెప్తాడు. ముందుగా వీరేష్‌ను హత్య చేస్తాడు ఫణి. దీంతో తులిక, వీరేష్‌లను పోగొట్టుకున్న అమృత్.. బెనీ మొహాన్ని కాల్చేస్తాడు. ఫణిని కొట్టి కొట్టి చంపేస్తాడు.
అలాంటివారు చూడొద్దు..
‘కిల్’ కథ గురించి వినడానికి సింపుల్‌గానే అనిపించినా.. చూస్తున్నప్పుడు మాత్రం చాలామందికి డిస్టర్బింగ్‌గా అనిపించడం ఖాయం. సినిమాల్లో మామూలు ఫైట్ సీన్స్ చూడడానికి కూడా ఇబ్బందిపడే ప్రేక్షకులు.. ‘కిల్’కు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా తన ఫ్రెండ్‌ను, గర్ల్‌ఫ్రెండ్‌ను పోగొట్టుకున్న హీరో.. విలన్స్‌పై ఒక్కసారిగా తిరగబడి వారిని చంపే సీన్స్ మాత్రం పూర్తిగా రక్తపాతంతో నిండిపోయి ఉంటాయి. ఇప్పటికీ పలు థియేటర్లలో ‘కిల్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మోహ్తా, అచిన్ జైన్ నిర్మించారు.
Also Read: శవాలను వండి మనుషులకు తినిపించే కిల్లర్ - సూపర్ మార్కెట్‌లోని మరణాలతో సంబంధం ఏమిటీ?