ఎట్టకేలకు హిట్టు కొట్టిన కార్తికేయ - 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన 'బెదురులంక 2012'
'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ.. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ 'బెదురులంక 2012' సినిమాతో మంచి హిట్టు కొట్టాడు.
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజై, సక్సెస్ ఫుల్ గా రన్ నడుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లో బ్రేక్-ఈవెన్ సాధించింది. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో 17వ టాలీవుడ్ క్లీన్ హిట్ గా నిలిచినట్లు తెలుస్తోంది.
'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. టాక్ తో పాటుగా రివ్యూలు కూడా అలానే వచ్చాయి. అయినప్పటికీ ఫస్ట్ డే 1.7 కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. 'కింగ్ ఆఫ్ కొత్త' 'గాండీవధారి అర్జున' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం కార్తికేయ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఫలితంగా రెండో రోజు నుంచి కలెక్షన్స్ పుంజుకున్నాయి. సెకండ్ డే కంటే మూడో రోజు ఎక్కువ నంబర్స్ రాబట్టగలిగింది.
మొదటి వారాంతంలో దాదాపు రూ. 6.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'బెదురులంక 2012' సినిమా.. సోమవారం (4వ రోజు) ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 1 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం నాటి కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ అందుకోబోతోంది. ఫుట్ ఫాల్స్ చూస్తుంటే ఈ వీకెండ్ లోనూ మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: నా సామిరంగ - ఈసారి సంక్రాంతికి 'బీడీలు' 3D లో కనిపిస్తాయేమో!?
'బెదురులంక' సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంతో హీరో కార్తికేయ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఎందుకంటే యువ హీరో చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ సాధించిన తర్వాత అతనికి మరో విజయం దక్కలేదు. పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా, ఆశించిన హిట్టు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ హిట్ దక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు.
ప్రస్తుతం 'బెదురులంక' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కార్తికేయ.. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ''సాన్నాళ్లకి సెవిన పడ్డ మాట.. బ్లాక్ బస్టర్!! 'బెదురులంక 2012' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు సపోర్ట్ కు చాలా కృతజ్ఞతలు'' అని ట్వీట్ చేసారు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. లాంగ్ రన్ లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి.
సాన్నాళ్లకి సెవిన పడ్డ మాట.. BlockBuster!!
— Kartikeya (@ActorKartikeya) August 29, 2023
Thank you all for making it 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 𝗕𝗘𝗗𝗨𝗥𝗨𝗟𝗔𝗡𝗞𝗔 😍
Immensely grateful for all the love & support 🙏🏼😇#Bedurulanka2012 pic.twitter.com/2K8gsgVCTX
'బెదురులంక 2012' సినిమాని సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. 'కలర్ ఫోటో', 'తెల్లవారితే గురువారం' చిత్రాల తర్వాత లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వచ్చిన మూవీ ఇది. ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ లో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
Also Read: ‘ఖుషి’ సినిమాకి, సమంత రియల్ లైఫ్‌కు పోలికలు ఉన్నాయా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial