Jayam Ravi: నా కాల్షీట్స్ వేస్ట్ చేశారు - రూ.9 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ సంస్థపై జయం రవి పిటిషన్
Ravi Mohan: తన కాల్‌షీట్స్ వేస్ట్ చేశారంటూ ఓ చిత్ర నిర్మాణ సంస్థపై కోలీవుడ్ స్టార్ జయం రవి పిటిషన్ వేశారు. తనకు రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు.

Jayam Ravi Seeking Compensation Over Wasted Dates: తన భార్య ఆర్తి రవితో డివోర్స్, సింగర్ కెనీషాతో రిలేషన్ షిప్ రూమర్స్ తర్వాత కోలీవుడ్ స్టార్ జయం రవి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ నిర్మాణ సంస్థపై ఆయన కోర్టు మెట్లెక్కారు. తన కాల్షీట్స్, డేట్స్ వృథా చేసినందుకు రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
కోయంబత్తూర్‌కు చెందిన బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా జయం రవి రెండు మూవీస్ చేసేందుకు అగ్రిమెంట్ కుదిరింది. దీని కోసం సదరు సంస్థ రూ.6 కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించింది. అయితే, ఆయన తమ సంస్థకు మూవీస్ చేయకుండా వేరే మూవీస్ చేస్తున్నారంటూ... తామిచ్చిన అడ్వాన్స్ వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని చెన్నై సిటీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన రవి మోహన్ సైతం చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు.
డేట్స్ వేస్ట్ చేశారు
తాను కేటాయించిన కాల్షీట్స్‌ను సదరు సంస్థ సరిగ్గా ఉపయోగించుకోలేదని... దీంతో మరికొన్ని డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు రవిమోహన్. అగ్రిమెంట్ ప్రకారం మూవీస్ పూర్తి చేయకపోవడంతో తనకు 80 రోజుల కాల్‌షీట్స్ వేస్ట్ అయ్యాయని... దీంతో మరో మూవీ షూటింగ్‌లో పాల్గొనలేకపోయినట్లు చెప్పారు. 'ఆ సంస్థ అడ్వాన్స్ తిరిగి ఇమ్మంటే నేను వేరే చిత్రం చేసి అడ్వాన్స్ తిరిగి ఇస్తానని చెప్పాను. అయితే, వారం రోజుల్లోనే ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఆ సంస్థ ఒత్తిడి చేసింది. నా కాల్‌షీట్స్ సరిగ్గా వాడకపోవడం వల్ల నాకు నష్టం వాటిల్లింది. దీంతో నేను ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా. ఆ నిర్మాణ సంస్థ నుంచి నాకు రూ.9 కోట్లు ఇప్పించాలి.' అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ స్టంట్స్! - వైరల్ వీడియోపై ఫుల్ క్లారిటీ
సంస్థ వాదన ఏంటంటే?
అయితే, సంస్థ తరఫున లాయర్ వాదన మరోలా ఉంది. తమ మధ్య ఒప్పందాన్ని రవి మోహన్ ఉల్లంఘించారని... ముందుగా అగ్రిమెంట్ చేసుకుని వేరే సినిమాలో నటించారని దీని వల్ల సంస్థకు సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. అందువల్ల జయం రవి పిటిషన్ విచారణకు అర్హమైనది కాదంటూ వాదించారు. ఇరువర్గాల వాదన విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
మరోవైపు... జయం రవి, ఆర్తి రవి డివోర్స్ పిటిషన్ విచారణ ఇంకా కోర్టులోనే ఉంది. గతేడాది తన భార్యతో డివోర్స్ తీసుకున్నానంటూ ఆయన అనౌన్స్ చేయగా... కేసు కోర్టులోనే ఉందని అఫీషియల్ కాదంటూ ఆమె ప్రకటించారు. ఇటీవల ఓ పెళ్లి ఈవెంట్‌లో సింగర్ కెనీషాతో జయం రవి కలిసి కనిపించగా వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. అయితే, ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. జయం రవి, ఆర్తి రవి ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్‌కు హాజరు కాగా... తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.





















