Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Jani Master Speech KCR Movie: లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత జానీ మాస్టర్ తొలిసారి నోరు విప్పారు. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
Jani Master: అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జైలుకు వెళ్లొచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తొలిసారి ఓ సినీ వేడుకలో కనిపించారు. ‘జబర్దస్త్’ కమెడియన్ రాకింక్ రాకేష్ హీరోగా తెరకెక్కిన ‘KCR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తన విషయంలో రీసెంట్ గా జరిగిన పలు పరిణామాల గురించి స్పందించారు. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి!
రీసెంట్ గా తన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు జరిగాయన్నారు జానీ మాస్టర్. “గత కొద్ది రోజులుగా నా జీవితంలో కొన్ని మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. నన్ను నమ్మిన ప్రతీ ఒక్కరికీ... తనను ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన వారందరికీ థ్యాంక్స్. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు. త్వరలోనే అన్నీ తెలుస్తాయి” అన్నారు. భర్తకు ఎల్లవేళలా తోడుగా ఉండేది భార్య మాత్రమే అన్నారు. “ఒక భర్త వెనుకాల భార్య ఉంటుంది. ఆమె ఒక పవర్. ఎందుకు చెప్తున్నాను అంటే... ఈ మధ్య నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. ఆ సమయంలో నా భార్య నాకు ఎంతో అండగా నిలిచింది. ఒక వెన్నుముకలా నిలిచి అన్నీ చూసుకుంది. భార్యలు వెనుక ఉండి భర్తలను సరైన దారిలో నడిపిస్తున్నారు. తల్లిగా, ఫ్రెండ్ గా ఉండి మంచి మార్గంలో తీసుకువెళ్తున్నారు. వారి వల్లే భర్తలు మంచి విజయాలను సాధిస్తున్నారు. అలాగే, రాకేష్ వెనుక సుజాత ఉంది” అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.
చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించాలి!
‘KCR’ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందన్నారు జానీ మాస్టర్. “రాకేష్ చాలా మంచి వ్యక్తి. ‘జబర్దస్త్’కు వచ్చినప్పుడు నుంచి తనతో పరిచయం ఉంది. ఎప్పుడూ ఒకరి గురించి నెగెటివ్ చెప్పడు. సెల్ఫిష్ గా ఉండాలనుకోడు. పదిమంది సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి వచ్చినవారందరికి థాంక్స్. ఇక్కడకు వచ్చినవారందరూ అలా కష్టపడినవారే. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వేడుకలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి రోజా, సుడిగాలి సుధీర్, జానీ మాస్టర్ కూడా ఈవెంట్ కు గెస్టులుగా హాజరయ్యారు. మీడియా ఫోకస్ అంతా జానీ మాస్టర్ మీదే పడింది. ఇక ‘KCR’ సినిమాకు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాకింగ్ రాకేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నవంబర్ 22 న రిలీజ్ కానుంది.