International Women's Day: భవిష్యత్ తరాలకు ఊపిరైన మహిళలందరికీ సెల్యూట్ - చిరంజీవి
ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. భార్య సురేఖ, అమ్మ అంజనా దేవితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్త్రీమూర్తులపై అభినందనలు కురిపించారు. వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలో తమ న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ తరాలు ముందుకెళ్లడానికి మహిళలు ఊపిరి అందిస్తున్నారని చెప్పారు. తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీళ్లే అంటూ తల్లి అంజనీదేవి, భార్య సురేఖతో దిగిన ఫోటోను మెగాస్టార్ షేర్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ లో ఏమన్నారంటే?
“ప్రపంచంలోని మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలు అందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
#HappyWomensDay to ALL the Women of the world! Saluting all the inspirational women who have fought & are fighting to claim their rightful space & place in the world. You are the Wind beneath the Wings of future generations! Here are the Two most influential women of My life 💐🙏 pic.twitter.com/JZhKHHAY1b
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2023
ప్రపంచం గర్వించే స్థాయిలో మహిళల శక్తి ఉండాలి- చిరంజీవి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మహిళలపై ప్రశంసలు కురిపించారు. తన కోసం తన తల్లి, తన భార్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. “ఒక ఫ్యామిలీలో మహిళలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని వారంతా ఎంతో శ్రద్ధగా గొప్పగా నిర్వహిస్తారు. చిన్న తనంలో మా కోసం అమ్మ ఎంతగానో కష్టపడ్డారు. ఆమె చేసిన సేవలు మహిళల పట్ల నాకు ఎంతో గౌరవాన్ని పెంచాయి. మహిళా పక్షపాతిగా మార్చాయి. ఇక నేను సినిమా రంగంలో సక్సెస్ కావడానికి, అగ్రహీరోగా ఎదగడానికి నా భార్య సురేఖ ముఖ్య కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. నేను కేవలం సినిమాల మీదే ఫోకస్ పెడతాను. ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ కచ్చితంగా ఉంటుంది. నా విజయం వెనుకున్న మహిళ నా భార్య సురేఖ. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కావడం లేదు. కిచెన్ ఉంచి స్పేస్ వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధిస్తున్నారు. మహిళా సాధికారత కోసం అందరూ కలిసి పని చేయాలి. ప్రతి ఫ్యామిలీలో తల్లి, సోదరి సాధికారత కోసం కలిసి ముందుకురావాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో మహిళల శక్తి ఉండాలి’’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: మా బాబుకు చూపించే తొలి సినిమా అదే, కొడుకు విషయంలో కాజల్ కండీషన్లు మామూలుగా లేవుగా!