Happy Birthday Suriya: సినిమాల్లోకి రాకముందు సూర్య ఏం చేసేవాడో తెలుసా? రూ.600 మాత్రమే జీతం - హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Happy Birthday Suriya: నేడు(జూలై 23) నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని చూద్దాం.
Happy Birthday Suriya: టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ నటులలో సూర్య ఒకరు. ఆయన నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేస్తూ, మన హీరోల రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న వర్సటైల్ యాక్టర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు (జులై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన కెరీర్ లో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
⦿ ప్రముఖ తమిళ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు తొలి సంతానంగా 1975 జులై 23న చెన్నైలో జన్మించారు సూర్య. ఆయన అసలు పేరు శరవణన్ శివకుమార్. అతనికి తమ్ముడు కార్తీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వీరికి బృందా శివకుమార్ అనే సోదరి ఉంది.
⦿ డిగ్రీ చదివిన సూర్య, సినిమాల్లోకి రాకముందు ఓ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యారు. మొదటి రెండు నెలలకిగాను 1200 రూపాయలు జీతంగా అందుకున్నారు. అయితే ఆ కంపెనీలో తాను నటుడు శివకుమార్ కొడుకు అనే విషయాన్ని సూర్య ఎవరికీ చెప్పుకోలేదు.
⦿ ఆ సమయంలో సూర్యకు 'ఆశ' సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. కానీ నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ ఆఫర్ ను తిరస్కరించారు. దీంతో డైరెక్టర్ వసంత్ ఆ చిత్రాన్ని అజిత్ కుమార్ తో చేశారు.
⦿ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం మానేసి, అప్పు చేసి సొంతంగా ఓ కంపెనీ పెట్టారు సూర్య. బిజినెస్ మీద ఆసక్తి తగ్గడంతో దాన్ని మూసేయగా.. 25 వేల అప్పు మిగిలింది. అప్పును తీర్చడానికి సినిమాల్లోకి రావడం ఒక్కటే దారి అని సూర్య నిర్ణయించుకొని వసంత్ ను సంప్రదించారు.
⦿ 22 ఏళ్ల వయసులో 1997లో 'నెరుక్కు నెర్' అనే చిత్రంతో తెరంగేట్రం చేశారు సూర్య. ఈ సినిమా నిర్మాత అయిన దర్శకుడు మణిరత్నం.. శరవణన్ పేరుని సూర్యగా మార్చారు.
⦿ సిద్ధిఖ్ దర్శకత్వంలో చేసిన 'ఫ్రెండ్స్', బాల డైరెక్షన్ లో నటించిన 'నందా' సినిమాలు సూర్య కెరీర్ ను మలుపు తిప్పాయి. ఆ తర్వాత మేనన్ దర్శకత్వం వహించిన 'కాక్కా కాక్కా' చిత్రం స్టార్ హీరోగా మార్చేసింది. 'శివ పుత్రుడు' సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
⦿ మురగదాస్ తీసిన ‘గజిని’ సినిమా సూర్యను తెలుగులోనూ స్టార్ ని చేసింది. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ మూవీతో టాలీవుడ్ తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ని సాధించుకున్నారు. 'యముడు - సింగం' సిరీస్ తో తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
⦿ సూర్య తన సతీమణి జ్యోతికతో కలిసి తొలిసారిగా ‘పూవెల్లాం కేటుప్పార్’ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత మరో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘నువ్వూ నేనూ ప్రేమ’ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
⦿ జ్యోతిక సూచనతో తన పిల్లలు దియా, దేవ్‌ల పేర్లతో '2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్' అనే నిర్మాణ సంస్థని స్థాపించారు సూర్య. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు ఈ బ్యానర్ లోనే వచ్చాయి.
⦿ 'ఆకాశమే నీ హద్దురా'లో 17 ఏళ్ల కుర్రాడిగా కనిపించాల్సి రావడంతో, కంప్లీట్ డైట్‌తో 30 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్య పరిచారు సూర్య. ఈ చిత్రానికి గాను నిర్మాతగా, నటుడిగా రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారు.
⦿ 'జైభీమ్' దర్శకుడు, జర్నలిస్ట్ టీజే జ్ఞానవేలు స్ఫూర్తితో ‘అగరం ఫౌండేషన్’ ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్య. ఎందరో పేదపిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలో శిక్షణ అందిస్తున్నారు.
⦿ ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ సూర్య. అకామెడీ యూట్యూబ్ ఛానెల్‌లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ చిత్రం 'జైభీమ్'
⦿ నటుడిగా, నిర్మాతగానే కాదు టెలివిజన్ హోస్టుగానూ సూర్య పేరు తెచ్చుకున్నారు. 2012లో స్టార్ విజయ్ నిర్వహించిన 'నీంగళం వెల్లలం ఒరు కోడి' గేమ్ షోతో టీవీ ప్రెజెంటర్ గా మారారు. ఇది 'మీలో ఎవరు కోటీశ్వరుడు?' షోకి తమిళ వెర్షన్.
⦿ సూర్య 2012, 2013, 2015, 2016, 2017, 2018లో అత్యధిక సంపాదన ఉన్న యాక్టర్ గా ‘ఫోర్బ్స్ 100’ లిస్టులో స్థానం సాధించారు.
⦿ ప్రస్తుతం సూర్య 'కంగువ' వంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్ తో చెయ్యాల్సిన 'వడివాసల్' మూవీ హోల్డ్ లో వుంది.
Also Read: RRR రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి 2898 AD'