Dulquer Salmaan: 'సార్' డైరెక్టర్‌తో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఓ క్రేజీ అప్డేట్ తో ముందుకు వచ్చారు. డైరెక్టర్ వెంకీ అట్లూరీ స్ర్కిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో వీరిద్దరి కాంబో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dulquer Salmaan : తెలుగులోనూ తన మార్కెట్ ను విస్తరించే పనిలో పడ్డ మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్.. మరో కొత్త స్ర్కిప్ట్ తో రానున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కించబోతున్న ఈ దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హీరో ధనుష్ 'సార్' తో విజయాన్ని మూటగట్టుకున్న వెంకీ అట్లూరి.. దుల్కర్ సల్మాన్ తో మూవీ తీయబోతున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబోలో ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
'మహానటి',' సీతారామం' లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్.. భారీ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. పలు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో హను రాఘవపూడి డైరెక్షన్ లో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన 'సీతారామం' మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని సాంగ్స్, కథ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ప్రేక్షకులు దుల్కర్ ను అత్యంత ఆదరణ వచ్చింది. దీంతో ఆయనకు తెలుగులో భారీ డిమాండ్ ఏర్పడింది. అంతే కాదు సినీ డైరెక్టర్లు అతనితో సినిమా తీసేందుకు స్ర్కిప్టులు కూడా రెడీ చేసుకున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది.
తెలుగులో తనకు మంచి ఆదరణ లభించడంతో దుల్కర్.. తన మార్కెట్ ను మరింత విస్తరించాలనే ప్లాన్ లో పడ్డారు. అదే ఉత్సాహంతో ఓ క్రేజీ ఛాన్స్ ను కొట్టేసినట్టు తెలుస్తోంది. ధనుష్ సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో సినిమా తీయనున్నట్టు వార్తలు వినిపిస్తు్నాయి. కాగా ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని సినీ వర్గాల టాక్.
వెంకీ అట్లూరి తన నెక్ట్స్ సినిమాను ఓ నాన్-తెలుగు హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడంటూ గత కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 'సీతారామం'తో దుల్కర్ సల్మాన్, 'సార్' తో వెంకీ అట్లూరి విజయం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల్లో తప్పకుండా అంచనాలు పెరుగుతాయి.
ఇదిలా ఉండగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన 'సార్' సినిమా ధనుష్ కు మంచి పేరు తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన సినిమా సార్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు భాషల్లో కలిపి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి, రికార్డు సృష్టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలోని సాంగ్స్, స్టోరీ ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి.
ఇక దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘కింగ్ ఆఫ్ కొత’ అనే మలయాళ సినిమా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు సమాచారం. ఈ మూవీని సల్మాన్ తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తుండడం విశేషం.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?