Lucky Baskhar: 'లక్కీ భాస్కర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఆ మూవీస్ ఇష్టం లేదన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి
Venky Atluri: దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' మూవీకి సీక్వెల్‌ను డైరెక్టర్ వెంకీ అట్లూరి కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... ఆ మూవీకి సీక్వెల్ ఉందని చెప్పారు.

Director Venky Atluri Confirms Lucky Baskhar Sequel: దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన మూవీ 'లక్కీ భాస్కర్'. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని అప్పట్లోనే ఆడియన్స్ కామెంట్స్ చేశారు.
తాజాగా... దీనిపై డైరెక్టర్ వెంకీ స్పందించారు. 'లక్కీ భాస్కర్' మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... ''లక్కీ భాస్కర్'కు తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. అయితే, దీనికి కాస్త టైం పడుతుంది.' అని చెప్పారు. ధనుష్ హీరోగా తీసిన 'సార్' మూవీకి మాత్రం సీక్వెల్ ఉండదని అన్నారు. సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Also Read: 'AIR' వెబ్ సిరీస్ కాంట్రవర్శీకి చెక్ - ఆ సీన్స్ డిలీట్... వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు
'లక్కీ భాస్కర్' మూవీ గురించి
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు రాంకీ, మానస చౌదరి, శివన్నారాయణ, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బ్యాంకింగ్ సెక్టార్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ నేపథ్యంలో సినిమా రూపొందింది.
ముంబై కేంద్రంగా ఈ స్టోరీ సాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి భాస్కర్ (దుల్కర్ సల్మాన్) దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు. ప్రమోషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినా నిరాశే మిగులుతుంది. దీంతో ఫ్యామిలీ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు బ్యాంక్ నుంచి వారికి తెలియకుండా కాస్త డబ్బులు తీసుకుని ఓ మధ్యవర్తికి ఇస్తాడు. దాంతో వ్యాపారం చేసిన ఆ వ్యక్తి డబుల్ లాభంతో ఆ డబ్బును తిరిగి భాస్కర్‌కు ఇస్తాడు. తిరిగి ఆ డబ్బును ఎవరికీ తెలియకుండా బ్యాంకులో జమ చేస్తాడు. ఆ రిస్క్ తర్వాత భాస్కర్ చేసిన పెద్ద రిస్కేంటి? అది ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? భాస్కర్ కోటీశ్వరునిగా ఎలా మారాడు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఆ మూవీస్ ఇష్టం లేదు
తనకు బయోపిక్స్, థ్రిల్లర్, పీరియాడిక్ మూవీస్ చేయాలనే ఆసక్తి లేదని డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పారు. 'లక్కీ భాస్కర్' సక్సెస్ అయ్యాక చాలా మంది ప్రొడ్యూసర్స్ తనను బయోపిక్స్ చేయాలని సంప్రదించారని కానీ వాటిని తెరకెక్కించడం తనకు ఇష్టం లేదని అన్నారు. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసేలా అందమైన ఫ్యామిలీ చిత్రాలను చేయాలనిపించి... అందుకు అనుగుణంగా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.
సూర్యతో మూవీపై
వెంకీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదే ఆయనకు ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా. ప్రస్తుతం షూటింగ్ సాగుతుండగా... ఇది పూర్తిగా ఫ్యామిలీ స్టోరీ అని వెంకీ చెప్పారు. సినిమాలో మమితా బైజు హీరోయిన్ కాగా... రవీనా టాండన్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లో వస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.






















