Christopher Nolan's The Odyssey: చందమామ కథను హాలీవుడ్‌లో సినిమాగా తీస్తున్న నోలన్... విడుదలకు ఏడాది ముందే టికెట్స్ సేల్స్... 'ఒడిస్సీ' సంచలనం
ఇండియాలోనూ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా 'ఒడిస్సీ'. చందమామ కథ ఆధారంగా తీస్తున్న చిత్రమిది. ఆ వివరాలు తెలుసుకోండి.

చిన్నప్పుడు చదివిన చందమామ కథ హాలీవుడ్‌లో సినిమాగా వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ ఇప్పుడు అది నిజంగానే జరుగుతోంది.
హాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తీస్తున్న కొత్త సినిమా 'ది ఒడిస్సీ' (The Odyssey Movie) రిలీజ్ కి ఏడాది ముందే సంచలనాలు సృష్టిస్తోంది. జూలై 17, 2026న అంటే సంవత్సరం తర్వాత రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు అప్పుడే టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి అంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్రీకు రచయిత హోమర్ రాసిన 'ఒడిస్సీ' పురాణ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నోలన్. అయితే ఈ కథ మన చిన్నప్పుడు 'చందమామ' పుస్తకంలో సీరియల్ గా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. అదే అప్పట్లో సూపర్ హిట్ అయిన సీరియల్ 'రూపధరుడి యాత్రలు'. ఆ కథలో ఉన్న విశేషాలు ఏంటి?ఎందుకు ప్రపంచ సినీ జనం ఈ సినిమాపై అంత ఆసక్తిగా ఉన్నారు? ఇప్పుడు చూద్దాం.
రామాయణంతో దగ్గర పోలికలు
'ఒడిస్సీ'తో పాటు 'ఇలియడ్' కూడా!
ఒకప్పుడు పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన 'చందమామ' పుస్తకంలో ప్రపంచ పురాణ కథలు కూడా ప్రచురించే వారు. అందులో భాగంగా వచ్చినవే హోమర్ రాసిన 'ఇలియడ్'... 'ఒడిస్సీ' ఇతిహాసాలు. వాటిని 'భువన సుందరి', 'రూపుధరుడి యాత్రలు' పేరుతో తెలుగులో ప్రచురించేవారు. వీటికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. దీనిలో 'భువన సుందరి'కి మన రామాయణంతో దగ్గర పోలికలు ఉంటాయి. గ్రీకు రాజు భార్య హెలెన్ ను ట్రాయ్ నగర యువరాజు పారిస్ ఎత్తుకుపోవడం గ్రీకు రాజ్యాలన్నీ ఏకమై ట్రాయ్ తో పదేళ్ల పాటు యుద్ధం చేసి గెలవడం అనేది భువన సుందరి (ఇలియడ్)లో కథాంశం. దీనికి కొనసాగింపు కథే ఒడిస్సీ. ట్రాయ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించి గ్రీకుల విజయానికి కారణం అయిన 'ఇథాకా' రాజు 'ఒడీసియస్' ట్రాయ్ నుండి తన రాజ్యానికి తిరిగి వెళుతూ పదేళ్లపాటు చేసిన సాహస కార్యాలే రూపధరుడి యాత్రల (ఒడిస్సీ ) ప్రధాన కథాంశం. ఈ రెండు కథల్లో ఇలియడ్ ని ఇప్పటికే చాలా సార్లు సినిమాగా తీశారు. 'హెలెన్ ఆఫ్ ట్రాయ్', బ్రాడ్ పిట్ హీరోగా 'ట్రాయ్ (2004)' లాంటి చాలా సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టు కున్నాయి. కానీ 'ఒడిస్సీ'ది వేరే కథ
అడుగడుగునా అద్భుతాలుతో 'ఒడిస్సీ'
'ఇలియడ్' సినిమాగా తీయడం ఈజీ అంటారు హాలీవుడ్ పెద్దలు. ప్రేమ, వ్యామోహం, యుద్దాలు, కుట్రలు, ఎత్తుకు పైఎత్తులు ప్రధానంగా ఆ కథ ఉంటుంది. కానీ 'ఒడిస్సీ' అలా కాదు. దేవతలు, దెయ్యాలు, ఒంటి కన్ను రాక్షసులు, భారీ ఆకారంతో ఉండే మనుషులు, మనుషుల్ని పందులుగా మార్చేసే మంత్రగత్తెలు, తుఫాన్లు, మనుషుల్ని తినేసే మూడు తలలు జంతువులు, నరక లోక ప్రయాణాలు ఇలా పూర్తిగా అద్భుత రసంతో నిండి ఉంటుంది 'ఒడిస్సీ' కథ. అందుకే దీన్ని తెరకెక్కించాలంటే చాలా బడ్జెట్, భారీ టెక్నీకల్ సపోర్ట్ కావాలి. అందుకే గతంలో ఈ సినిమా తీసే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి. కొన్ని తీసినా అవి పెద్దగా హిట్ కాలేదు. ఇన్నాళ్లకు క్రిస్టోఫర్ నోలన్ లాంటి లెజెండరీ డైరెక్టర్ ఆ సాహసం తీస్తుండడంతో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా 'ఒడిస్సీ' కోసం ఎదురు చూస్తున్నారు. 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో ఆస్కార్ విన్నర్ మ్యాత్ డీమన్, 'స్పైడర్ మ్యాన్' హీరో టామ్ హాలెండ్, 'బ్యాట్ మ్యాన్' హీరో రాబర్ట్ పాటిన్ సన్, చార్లీ తెరాన్ లాంటి సూపర్ స్టార్లు నటిస్తున్నారు. ఏడాది ముందే ఐమాక్స్ టికెట్స్ ఓపెన్ చేస్తే ఒక్క రోజులోనే (17, జూలై 2025) ప్రపంచ వ్యాప్తంగా హౌస్ ఫుల్ అయిపోయాయి. అదీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి





















