Salaar: ప్రభాస్ కండలు గ్రాఫిక్స్ కాదు - క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా
Prabhas : ‘సలార్’లో కాటేరమ్మ సీన్‌లో నటించి ఫేమస్ అయిపోయింది చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా. ఆ మూవీలో నటించడంపై తన ఎక్స్‌పీరియన్స్ గురించి, ప్రభాస్ గురించి, ప్రశాంత్ నీల్ గురించి చెప్పింది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘సలార్’కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కేవలం ప్రభాస్‌ను మాత్రమే కాకుండా సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తపడ్డాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ మూవీలో చిన్న పాత్రలు చేసినవారికి కూడా బాగా పాపులారిటీ దక్కుతోంది. అలాంటివారిలో ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా సయ్యద్. ‘సలార్’లో కాటేరమ్మ సీన్‌లో నటించిన ఫర్జానా పాత్ర నిడివి కాసేపే అయినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందుకే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీ అయిపోయింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
తండ్రి ముస్లిం, తల్లి హిందూ..
ముస్లిం అయిన నువ్వు కాటేరమ్మ పాత్ర ఎలా పోషించగలిగావని ఫర్జానాను అడగగా.. తన తండ్రి ముస్లిం, తల్లి హిందూ అని బయటపెట్టింది. ఇంట్లో అన్ని పండగలు చేసుకుంటామని తెలిపింది. యాక్టింగ్ అనేది ముఖ్యమని, మతంతో సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవం గురించి కూడా ఫర్జానా మాట్లాడింది. ‘‘ఇలాంటి ఛాన్స్ రావడం నా అదృష్టం. పాన్ ఇండియా సినిమా. అసలు ఊహించలేదు కానీ ఛాన్స్ వచ్చింది చాలా హ్యాపీ’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది. ప్రభాస్ కండలు గ్రాఫిక్స్ కావని, బయట ఎలా ఉన్నారో.. సినిమాలో కూడా అలాగే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. మొత్తం 30 రోజులు ‘సలార్’ షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పింది.
ప్రశాంత్ నీల్ ఒక క్లోజ్ ఫ్రెండ్
ప్రభాస్‌తో పలుమార్లు మాట్లాడే అవకాశం వచ్చిందని, మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా అందగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చారని బయటపెట్టింది ఫర్జానా. అన్నిరోజుల షూటింగ్‌లో ప్రభాస్ కోప్పడడం ఎప్పుడూ చూడలేదని చెప్పింది. ఆయన అసలు డైటింగ్ చేయరని, ఎంత కావాలంటే అంత ఫుడ్ తింటారని రివీల్ చేసింది. ఇక తన కెరీర్ గురించి చెప్తూ మోడల్‌గా పలు యాడ్స్ చేశానని, అలాగే ‘సలార్’ అవకాశం వచ్చిందని చెప్పింది ఫర్జానా. ఆ పాత్ర కోసం చాలామంది ఆడిషన్స్‌కు వచ్చారని, దానికి తనే సెలక్ట్ అవ్వడం తన అదృష్టమని తెలిపింది. ప్రశాంత్ నీల్ ఒక డైరెక్టర్‌గా కాకుండా, క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండేవారని, రీహార్సెల్స్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారని, నిజంగానే క్లోజ్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ వచ్చిందని దర్శకుడిపై ప్రశంసలు కురిపించింది.
‘సలార్ 2’ గురించి ఏమీ తెలియదు
తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా అవకాశాలు వస్తే చేస్తానని, అదంతా తన తల్లిదండ్రులు చూసుకుంటారని చెప్పింది ఫర్జానా. ‘సలార్’లో తన పాత్ర తనకు చాలా నచ్చిందని తెలిపింది. సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెప్పారు. కానీ టర్నింగ్ పాయింట్‌లా మారుతుందని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎక్కువశాతం తన సీన్స్ అన్నీ సింగిల్ టేక్ అని తెలిపింది. సినిమాలో తన పాత్రకు కావాల్సిన మేకప్, కాస్ట్యూమ్స్ అన్నింటికి కలిపి ఒక గంట సమయం పట్టేదని బయటపెట్టింది. ఫ్రెండ్స్ కూడా పాత్ర బాగుందని చెప్తున్నారని తెలిపింది. ఒకవేళ ప్రభాస్ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలనుకుంటూ ‘మిర్చీ’ చేస్తానని చెప్పుకొచ్చింది. ‘సలార్’ షూటింగ్ మొత్తం తనకు బెస్ట్ మెమోరీ అని చెప్పింది. తను చేసిన అన్నింటిలో ఒక సీన్ కట్ చేశారని బయటపెట్టింది. ‘సలార్ 2’ గురించి తనకు ఏం తెలియదని సూటిగా చెప్పేసింది ఫర్జానా.
Also Read: అట్లీతో అల్లు అర్జున్ సినిమా - కన్ఫర్మ్ అయినట్లేనా?