Baby Leaks: బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్!
Baby Movie Controversy: తన కథను కాపీ చేసి సాయి రాజేష్ 'బేబీ' చేశారని శిరిన్ శ్రీరామ్ గతంలో ఇప్పుడు ఆరోపించారు. తాజాగా సాయి రాజేష్ మీద ఆయన 'బేబీ లీక్స్' పేరుతో బుక్ విడుదల చేశారు.
Baby Leaks - Sai Rajesh Vs Shirin Sriram: సాయి రాజేష్ సాయం చేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచే రకం అని 'ప్రేమించొద్దు' దర్శకుడు శిరిన్ శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఐడియాను కాపీ కొట్టి 'బేబి' సినిమా తీశాడని ఆయన గతంలో ఆరోపించారు. ఇప్పుడు సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద 'బేబీ లీక్స్' పేరుతో ఒక బుక్ అందుబాటులోకి తెచ్చానని శనివారం శిరిన్ శ్రీరామ్ తెలిపారు.
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన తారాగణంగా శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ప్రేమించొద్దు'. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో శిరీన్ శ్రీరామ్ మరోసారి సాయి రాజేష్ గురించి స్పందించారు. తనకు సాయి రాజేష్ చేసిన మోసం, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవిగో అంటూ మీడియా ముందుకు వచ్చారు.
నాకే కథ చెప్పానని రిప్లై నోటీసు ఇచ్చాడు - శిరిన్ శ్రీరామ్
'బేబీ' కథ ఎక్కడ మొదలైంది? అనేదాని గురించి శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ... ''నేను 2015లో రవికిరణ్ అనే వ్యక్తిని కలిశా. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి చంపారని ఆయన ఫేస్ బుక్ పోస్ట్ చూసి కథ అనుకున్నా. బస్తీ అమ్మాయి నేపథ్యంలో కథ రాశా. ఆ సమయంలో సాయి రాజేష్ (Sai Rajesh)తో పరిచయం ఏర్పడింది. ఆయనతో ఏడాది ట్రావెల్ చేశా. దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని, తానే మూవీ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. ఆలస్యం కావడంతో ప్రొడ్యూస్ చేయరని బయటకు వచ్చేశా. గొడవలేం జరగలేదు. కానీ, నా కథ కాపీ చేసి బూతు సినిమా 'బేబీ' తీశాడు. అది విడుదలైనప్పుడు నేను గొడవ చేయలేదు. ఎందుకంటే... నేను కోలుకోవడానికి, రీయలైజ్ కావడానికి సమయం పట్టింది. సాక్ష్యాలు సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశా. కాపీరైట్ నోటీసు పంపించాం. అయితే... నాకే ఆ కథ చెప్పానని సాయి రాజేష్ రిప్లై నోటీసు ఇచ్చాడు. ఫిబ్రవరిలో రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు పెట్టాను. నాపై ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలిలో కంప్లైంట్స్ చేశాడు. దాంతో సాయి రాజేష్ మీద 'బేబీ లీక్స్' బుక్ తెచ్చా'' అని చెప్పారు.
Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై విష్ణు మంచు ట్వీట్... నటి హేమపై అప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడి
లాయర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ... ''బేబీ' కాపీరైట్ కేసులు సాక్ష్యాలు ఎలా? అని అడిగితే... ప్రతిదీ తేదీతో సహా శిరిన్ సేవ్ చేసుకున్నాడు. అవన్నీ చూసి షాకయ్యా. క్రియేటివిటీ ఉన్న వ్యక్తికి ఇలా జరగడం బాధగా ఉంది. పోలీసులు సైతం సాక్ష్యాలు చూసి షాకయ్యారు. ఛీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిరసీ, కాపీ రైట్ యాక్ట్ వంటి పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు'' అని చెప్పారు. ఈ కేసు విషయంలో తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని రవి కిరణ్ తెలిపారు. సాయి రాజేష్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
Also Read: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ - విశ్వక్ సేన్ మాస్, ఎవడైనా మీదకొస్తే పులిలా మీద పడిపోవడమే!