Arvind Swami: విజయ్‌కు ఓటేయను, అలా అవ్వగలడని హామీ ఇవ్వలేం - హీరోల పొలిటికల్ ఎంట్రీపై అరవింద్ స్వామి కామెంట్స్
Arvind Swami: సినిమాల్లో స్టార్లుగా ఎదిగినవారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అనే డౌట్ ఉంటుంది. తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా అదే సందేహం వ్యక్తం చేశారు.
Arvind Swami: తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది నెటిజన్లు.. దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీల మధ్య కూడా ఇది డిస్కషన్స్‌కు దారితీస్తోంది. ఎప్పటినుండో కొందరు తమిళ హీరోల పొలిటికల్ ఎంట్రీ గురించి ఇతర హీరోల మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా నటుడు అరవింద్ స్వామి.. హీరోల పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది పాత వీడియో అయినా కూడా ఇందులో తను వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రస్తుత పరిస్థితులకు సూట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
సినిమాలు, రాజకీయాలు ఒక్కటి కాదు..
కొందరు నటీనటులు సినీ పరిశ్రమలో స్టార్‌గా, ఎనలేని పాపులారిటీతో విజయం సాధిస్తారు. కానీ అదే నటీనటులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అలా సినీ పరిశ్రమలో స్టార్‌గా పేరు తెచ్చుకొని రాజకీయాల్లో ఫెయిల్ అయినవారు కూడా ఉన్నారు. అందుకే సినిమాలను, రాజకీయాలను లింక్ చేసి చూడవద్దని కొందరు ప్రజలు భావిస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న అరవింద్ స్వామి ఇంటర్వ్యూలో ఆయన కూడా అదే మాట చెప్పారు. హీరోలుగా వారు ఇండస్ట్రీలో రాణించినా.. ఒక రాజకీయ నాయకుడిగా వారికి పదవిని, బాధ్యతను అందిస్తే వారు పూర్తి స్థాయిలో దానికి న్యాయం చేయగలరా లేదా ఎవ్వరం చెప్పలేం అని అరవింద్ స్వామి అన్నారు.
ఆ విషయం చెప్పలేం..
‘‘రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్‌లకు నేను పెద్ద ఫ్యాన్. కానీ నేను వాళ్లకు ఓటు వేయను. వాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మార్పు వస్తుందా లేదా అని కూడా నేను చెప్పలేను. ఒకవేళ వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి ఫలానా మార్పులు తీసుకువస్తాం అని హామీలు ఇస్తే.. ఆ హామీల గురించి నేను వివరంగా తెలుసుకోవాలని అనుకుంటాను. నటీనటులు మంచి ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారేమో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ను హ్యాండిల్ చేస్తూ ప్రజలను పాలించగలరా లేదా అనేది చెప్పలేం. ఒక మంచి యాక్టర్ అయితే ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా అవ్వగలడని ఎవ్వరం హామీ ఇవ్వలేం. మంచి యాక్టర్ అయితే ప్రభుత్వ పాలిసీలను హ్యాండిల్ చేయడానికి అర్హుడని కూడా చెప్పలేం’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అరవింద్ స్వామి.
2026 ఎలక్షన్స్‌పై ఫోకస్..
ప్రస్తుతం ‘తమిళ్ వెట్రి కళగన్’ అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు విజయ్. ఈ సందర్భంగా అరవింద్ స్వామి చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం విజయ్.. సినిమాల్లో ఎలా సక్సెస్ సాధించాడో.. రాజకీయాల్లో కూడా అదే విధంగా సక్సెస్ సాధిస్తాడని ధీమాతో ఉన్నారు. ఇక 2024 లోక్ సభ ఎన్నికలను టార్గెట్ చేస్తూ విజయ్ పార్టీ స్థాపించాడని వార్తలు వచ్చినా.. అది నిజం కాదని ఈ హీరో క్లారిటీ ఇచ్చేశాడు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పాల్గొనడం మాత్రమే కాదు.. తాము ఏ పార్టీకి సపోర్ట్‌గా కూడా నిలబడము అని తెలిపాడు. ప్రస్తుతం ‘తమిళ్ వెట్రి కళగన్’ పూర్తి ఫోకస్ 2026 తమిళనాడు ఎన్నికలపైనే ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు విజయ్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి పూర్తిగా సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు.
Also Read: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?