Aliya Fakhri Arrested: మాజీ బాయ్ ఫ్రెండ్‌ను సజీవంగా తగలబెట్టేసిన హీరోయిన్ సిస్టర్... మర్డర్ కేసులో అరెస్ట్
Nargis Fakhri Sister Arrest: బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ సోదరి అరెస్ట్ అయినట్టుగా సమాచారం. మాజీ బాయ్ ఫ్రెండ్ ను సజీవంగా తగలబెట్టేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాధారణంగా సినిమాలలో ఎవరికైనా ఇతరులపై కోపం వస్తే కొట్టడం, అవసరమైతే తగల బెట్టేయడం వంటివి చూస్తూ ఉంటాము. అది తెరపై చూసే సినిమా కాబట్టి బాగానే చూస్తాము. అందులోనూ హీరో ఇలాంటి పనులు చేస్తే విజిల్స్ వేసి, అల్లరల్లరి చేస్తాము. కానీ అది రియల్ లైఫ్ లో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ సోదరి ఏకంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని తగలబెట్టేసిన షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సోదరి అలియా ఫక్రీ తాజాగా అమెరికాలో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. జంట హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలుగా ఉండగా, తాజాగా న్యూ ఇయర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గత నెలలో మాజీ బాయ్ ఫ్రెండ్ తో పాటు అతని స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగింది.
అసలు విషయం ఏమిటంటే... అలియా గతంలో కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే అబ్బాయి తో డేటింగ్ చేసింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అలియాతో బ్రేకప్ జరిగి ఏడాది పూర్తయ్యాక జాకోబ్... అనాస్టాసియా ఎటినీ అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం సాన్నిహిత్యానికి దారి తీసింది. అయితే అప్పటికే జాకోబ్ తో బ్రేకప్ అయిపోయిన అలియా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్టుగా తెలుసుకుంది. దీంతో పలుమార్లు ఈ విషయమై మాజీ బాయ్ ఫ్రెండ్ ను బెదిరించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2న జాకోబ్ తో పాటు అతని స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు అలియా వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి డైరెక్ట్ గా ఇద్దరూ లోపల ఉండగానే, ఆ ఇంటికి నిప్పంటించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటల్లో చిక్కుకోవడంతో బ్రతికుండగానే వారిద్దరూ సజీవ దహనం అయ్యారు. అయితే ఇదంతా చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు విషయాన్ని చెప్పడంతో, వారి వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తాజాగా అలియా ఫక్రీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: అజిత్ కొత్త సినిమాకు లీగల్ ట్రబుల్స్... 127 కోట్లు నష్టపరిహారం కోరుతూ నోటీసులు
ఈ కేసులో ఒకవేళ ఆమె దోషిగా తేలితే మాత్రం జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను రిమాండ్ కు తరలించగా, డిసెంబర్ 9న తదుపరి విచారణ జరగబోతోంది. అయితే ఈ విషయంపై నర్గీస్ ఫక్రీ ఇంకా రియాక్ట్ కాలేదు. ఇక నర్గీస్ విషయానికి వస్తే.. రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'రాక్ స్టార్' సినిమాతో ఆమె మంచి గుర్తింపును దక్కించుకుంది. అలాగే కిక్, హౌస్ ఫుల్ -3 వంటి సినిమాల్లో కూడా నటించింది. ఈ బ్యూటీ ఇప్పుడు 'హౌస్ ఫుల్-5 తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.