Trisha fires on LEO co-star: 'లియో' యాక్టర్‌పై ఫైర్ అయిన త్రిష.. సపోర్ట్‌గా నిలిచిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్!
Actress Trisha Tweet : నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన సెక్సిస్ట్ కామెంట్స్ పై త్రిష సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ట్వీట్ చేసింది.
Trisha fires on LEO co-star: సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ను ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన సెక్సిస్ట్ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. 'లియో' సినిమాలో త్రిషతో రేప్ సీన్ రాలేదని బాధపడ్డానని నటుడు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే మన్సూర్ తన గురించి అసహ్యకరమైన రీతిలో మాట్లాడటంపై త్రిష తీవ్రంగా స్పందించింది. అతని నీచమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తాజాగా ట్వీట్ చేసింది. తన సినీ కెరీర్ లో ఇకపై అతనితో కలిసి నటించేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆమెకు మద్దతుగా నిలిచారు.
కోలీవుడ్ హీరో విజయ్ - డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన 'లియో' సినిమాలో త్రిష, మన్సూర్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మన్సూర్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను త్రిషతో కలిసి నటించబోతున్నాని విన్నప్పుడు, సినిమాలో బెడ్ రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో కుష్బూ, రోజా వంటి హీరోయిన్లతో చేసినట్లుగానే ఆమెను కూడా బెడ్ రూమ్ కి తీసుకెళ్లవచ్చని ఆశ పడ్డాను. నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. అవి నాకు కొత్తేమీ కాదు. కానీ ఈ కుర్రాళ్ళు కాశ్మీర్ షెడ్యూల్ లో కూడా త్రిషను నాకు చూపించలేదు'' అని అన్నారు.
'లియో' కోస్టార్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది త్రిష. ''ఇటీవల మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన ఓ వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతను స్త్రీలపై ద్వేషంతో అగౌరవంగా అసహ్యకరమైన రీతిలో మాట్లాడాడు. అలాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది. అతను కోరుకుంటున్నప్పటికీ, అలాంటి వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనందుకు సంతోషిస్తున్నా. నా సినీ కెరీర్‌లో ఇకపై అతనితో నటించకుండా చూసుకుంటాను.'' అని ఆమె ట్వీట్ లో పేర్కొంది.
Also Read: ఏజ్ బార్ అవుతున్నా ఈ బ్యూటీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదుగా!
త్రిష ట్వీట్ కు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ''మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు విని టీం అంతా నిరుత్సాహానికి, ఆగ్రహానికి గురవుతున్నాము. ఏ పరిశ్రమలోనైనా మహిళలు, తోటి కళాకారులు, ప్రొఫెషనల్స్ పట్ల గౌరవం అనేది ఉండాలి. నేను అతని ప్రవర్తనను పూర్తిగా ఖండిస్తున్నాను'' అని ట్వీట్ చేసారు. 'లియో' దర్శక హీరోయిన్ల ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అలానే నటీమణులను ఉద్దేశిస్తూ మన్సూర్ అలాంటి చెత్త కామెంట్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023
కాగా, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘లియో’ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో విజయ్ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా త్రిష నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోనా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేసారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ మరియు జగదీష్ పళనిసామి ఈ యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు విడుదల చేసారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో హీరో నాని బిజీ బిజీ!