Amitabh Bachchan: నన్ను అలా పిలవద్దు - రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై వివాదం, తొలిసారి స్పందించిన అమితాబ్
రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై వివాదం చెలరేగిన నేపథ్యంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
Amitabh Bachchan Social Media Post: రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై సోమవారం(ఆగష్టు 5) నాడు పెద్ద దుమారం చెలరేగింది. రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధన్ ఖర్ జయా పేరును జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడం గొడవకు కారణం అయ్యింది. తన పేరును జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని, జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సిన అవసరం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల సర్టిఫికెట్‌లో పేరు అలాగే ఉందని, పేరు మార్చుకుంటే తాము అలాగే పిలుస్తామని వెల్లడించారు. కాసేపు రాజ్యసభ చైర్మెన్, జయా బచ్చన్ నడుమ మాటల యుద్ధం నడిచింది.
సోషల్ మీడియాలో అమితాబ్ పోస్టు
రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై వివాదం చెలరేగిన నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘समय बड़ा बलवान ! काम के लिए समय निकाल रहे हैं‘ (సమయం చాలా శక్తివంతమైనది, పని కోసం సమయాన్ని కేటాయించాలి) అని రాసుకొచ్చారు. అయితే, ఈ పోస్టుకు రాజ్యసభ వివాదానికి ఎలాంటి సంబంధ లేనట్లు కనిపిస్తోంది. కానీ, కొందరు ఇందులో ఏదో నిగూఢ అర్థం ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
T 5094 - समय बड़ा बलवान ! काम के लिए समय निकाल रहे हैं
— Amitabh Bachchan (@SrBachchan) August 6, 2024
ఇంతకీ రాజ్యసభలో ఏం జరిగిందంటే?
తాజాగా రాజ్యసభలో చైర్మెన్ జగదీప్ ధన్ ఖర్ పై ఎంపీ జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై అభ్యంతరం చెప్పారు. పార్లమెంట్ లో సరికొత్త డ్రామా మొదలు పెట్టారంటూ చురకలు వేశారు. “అమితాబ్ గురించి మీకు తెలుసు. ఆయనతో నా పెళ్లి, భర్తగా ఉన్న అనుబంధం చూసి ఫ్రౌడ్ గా ఫీలవుతున్నాను. కానీ, నన్ను జయా బచ్చన్ అని పిలిస్తే చాలు. మహిళలకు సొంత గౌరవం అంటూ లేదా? మీరంతా ఓ కొత్త డ్రామా ప్రారంభించారు. ఇంతకు ముందు ఇలా ఉండేదికాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ పేరు మార్చుకోండి- రాజ్యసభ చైర్మెన్
జయా బచ్చన్ వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మెన్ ధన్ ఖర్ స్పందించారు. ఎన్నికల సర్టిఫికేట్ లో ఉన్న పేరునే తాము పిలిచామని, కావాలంటే పేరు మార్చుకునే నిబంధన కూడా ఉందని ఆయన వెల్లడించారు. “అమితాబ్ బచ్చన్ విజయాలకు దేశం గర్వపడుతున్నది. ఎన్నికల సర్టిఫికేట్ లో ఉన్న పేరునే మేం వాడుతున్నాం. కావాలంటే పేరు మార్చుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక నిబంధన కూడా ఉంది” అని వెల్లడించారు.
T 5094 - समय बड़ा बलवान ! काम के लिए समय निकाल रहे हैं
— Amitabh Bachchan (@SrBachchan) August 6, 2024
డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ పైనా జయా ఆగ్రహం
గతంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పైనా జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా అప్పట్లో జయ అమితాబ్ బచ్చన్ అని పిలిచారు. ఆయన అలా పిలవడంపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే రాజ్యసభ చైర్మెన్ మరోసారి అలా పిలవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: 'దసరా' నటుడికి అరుదైన వ్యాధి - ADHDతో బాధపడుతున్న షైన్ టామ్ చాకో, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!